ఎమ్బీయస్‍: స్ప్రింగ్ ఫీవర్

చేతిలో డబ్బు ఆడక కటకటలాడుతున్న జమీందారుకి ఇంట్లో వంటలక్కను పెళ్లాడదామని కోరిక. ఆ ప్రయత్నంలో ఆయనకి పోటీదారు బట్లర్. వంటలక్కకు పబ్ (మద్యశాల) కొనుక్కోవాలని ఆశ.

పి.జి. ఉడ్‌హౌస్ రాసిన ‘‘సమ్‌థింగ్ ఫ్రెష్’’ను గతంలో పరిచయం చేశాను. ఈసారి ఆయనే రాసిన “స్ప్రింగ్ ఫీవర్” అనే 1948 నాటి నవల కథా సంగ్రహాన్ని యిస్తున్నాను. అనగనగా బీవర్ అని లండన్‌కు దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూర్లో ఒక జమీందారు. ఆయనకో పెద్ద కోట లాంటి బంగళా, ఎస్టేటూ, ముగ్గురు కూతుళ్లు, భార్య చనిపోయింది. పెద్ద కూతురుని ఇల్లరికపు టల్లుడి కిచ్చి చేశాడు. రెండో కూతురికి ఇంట్లో తిష్ట వేసిన నాటక రచయిత అంటే ఇష్టం. అతనంటే ఈ జమీందారుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా ఏమీ చేయలేడు. కారణం, అజమాయిషీ, డబ్బు పెత్తనం అంతా పెద్దకూతురిదే. అందరూ ఆమె మాట వినాల్సిందే. ఇక మూడో అమ్మాయికి తండ్రి దగ్గర చేరిక ఎక్కువ.

చేతిలో డబ్బు ఆడక కటకటలాడుతున్న జమీందారుకి ఇంట్లో వంటలక్కను పెళ్లాడదామని కోరిక. ఆ ప్రయత్నంలో ఆయనకి పోటీదారు బట్లర్. వంటలక్కకు పబ్ (మద్యశాల) కొనుక్కోవాలని ఆశ. దానికి 200 పౌండ్లు కావాలి. బట్లర్‌కి గుర్రప్పందాల పిచ్చి కాబట్టి కొనగలుగతాడన్న నమ్మకం లేదు. జమీందారైతే కొనగలడని అతన్ని పెళ్లాడడానికి సిద్ధపడింది వంటలక్క. కానీ పేరుకి జమీందారే కానీ పెద్ద కూతురు రాలిస్తేనే డబ్బు రాలుతుంది కాబట్టి తనేమీ చేయలేడు. అందుచేత ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు. పెద్ద అల్లుడికి ఈయన మీద సింపతీ ఉన్నా అతని డబ్బు కూడా పెద్దమ్మాయి చేతిలోనే ఇరుక్కుపోయి వుంది. అతనూ నిస్సహాయుడు.

ఈ పరిస్థితులేమీ నచ్చని మూడో కూతురు, అనగా మన హీరోయిన్, నాటకాల్లో వేషాలేసి హాయిగా, స్వేచ్ఛగా బతుకుదామని ఇంట్లోంచి పారిపోయి లండన్ చేరింది. కానీ వేషాలు రాలేదు. అక్కడ ఓ అందగాడు పరిచయమైతే ప్రేమించింది కూడా. తీరా చూస్తే అతను ఈమెను తృణీకరించాడు. ఇక అక్కణ్నుంచి ఆమె అందగాళ్లను నమ్మడం మానేసింది. తర్వాత పరిచయమైన అందగాడు మైక్ (అతనే మన కథకు హీరో) కలిసి తన ప్రేమను వెల్లడించినా ఒప్పుకోనంది. ఎందుకంటే అతను హాలీవుడ్‌కి సినిమా ఏజంటుగా లండన్‌లో పని చేస్తున్నాడు. దాంతో మరీ బెదిరిపోయింది హీరోయిన్.

దానికి తోడు హీరో ఫ్రెండు, ఈమెకు దూరపు బంధువు, అమెరికాలో ఉంటూ ప్రస్తుతం లండన్‌కు వచ్చిన స్టాన్‌వుడ్ (సైడు హీరో అనుకుందాం) యీమెకు లండన్‌లో తారసిల్లి చెప్పాడు – మైక్ చుట్టూ ఎప్పుడూ బోల్డు మంది అమ్మాయిలు తిరుగుతూ సినిమా ఛాన్సుల కోసం వగలు కురిపిస్తూ ఉంటారని. అది విని యీమె మరింత భయపడింది. ఇలాటి వాణ్ని నమ్మలేము అనుకుంది. అందువల్ల హీరో ఎంత కాళ్లావేళ్లా పడినా కాదని చెప్పి లండన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి తండ్రి ‘రెండు వందల పౌండ్లు ఉంటే చూడు, వంటలక్కకు పబ్ కొనాలి’ అని పట్టుకున్నాడు. అంతలోనే అమెరికాలో ఉన్న దూరపుబంధువు దగ్గర్నుంచి టెలిగ్రాం వచ్చింది వాళ్ల అబ్బాయిని బీవర్ కోటకు పంపిస్తున్నట్టు!

ఆ అబ్బాయి ఎవరో కాదు, సైడు హీరోనే స్టాన్‌వుడ్‌యే! అతగాడు అమెరికాలో ఉన్నప్పుడు ఓ హాలీవుడ్ తార వెంటపడ్డాడు. ఆమె నుంచి దూరం చేయడానికి తండ్రి యితన్ని లండన్ తరిమేశాడు. ఓ మాజీదొంగని బట్లర్‌గా పెట్టుకుని కాలక్షేపం చేస్తూండగా, ఆ హాలీవుడ్ తార లండన్ వస్తోందని తెలిసింది. పాత వ్యవహారం కొనసాగించ వచ్చని యితను ఆనందిస్తుండగానే, ఆ వార్త అమెరికాలో ఉన్న వాళ్ల నాన్నకు కూడా తెలిసింది. తక్షణం కొడుకుని లండన్ నుంచి దూరంగా తరిమేయడానికి, లండన్‌కి కాస్త దూరంలో ఉన్న జమీందారు కోటకు వెళ్లమని హుకుం వేసి, మా అబ్బాయి వస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోండి అంటూ జమీందారుకి టెలిగ్రాం ఇచ్చాడు.

వీళ్లు దూరపు బంధువులే కానీ, ఒకళ్లు అమెరికా, మరొకళ్లు బ్రిటన్‌లో వుండి పోవడం చేత రాకపోకలు పెద్దగా లేవు. ఆ వచ్చే అతిథి స్టాన్‌వుడ్ రూపురేఖలేమిటో, ఎలా ఉంటాడో తెలీదు. ఇంట్లో ఉన్న నాటకాల వాడికి తోడు వీడొకడా అని జమీందారు ఇష్టపడలేదు. కానీ పెద్ద కూతురు పట్టుబట్టింది. ‘వాళ్ల నాన్న డబ్బున్నవాడు కనక మనం ఆయన మాట మన్నించ వలసినదే. లండన్ వెళ్లి, ఆ అబ్బాయికి లంచ్ ఇప్పించి దగ్గరుండి వెంటబెట్టుకుని రా’ అని అని తండ్రిని ఆజ్ఞాపించింది. పెద్దల్లుడితో కలిసి హాయిగా పాత స్టాంపులు చూసుకుంటున్న జమీందారు (వాళ్లిద్దరికీ అదో హాబీ) తప్పదురా దేవుడా అనుకుని హీరోయిన్‌తో కలిసి లండన్‌కి బయలుదేరాడు. కూతురు షాపింగ్‌కని బయల్దేరితే, వెళ్లి హాయిగా ఓ బార్‌లో కూచుని మందు కొట్టసాగేడు.

అక్కడికి స్టాన్‌వుడ్ వచ్చాడు. అతను, మైక్ కలిసి లంచ్ చేద్దామని అనుకున్నారు. మైక్ రావడం ఆలస్యం కావడంతో జమీందారుతో కబుర్లలో పడ్డాడు. ఇద్దరూ ఒకరి పేరు మరొకరు తెలుసుకోకుండానే వాళ్ల వాళ్ల సంగతులన్నీ వెల్లడించుకున్నారు. జమీందారు వంటలక్కతో తన పెళ్లి గొడవ కూడా చెప్పేశాడు. స్టాన్‌వుడ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. హాలీవుడ్ తార ఊళ్లోకే వచ్చింది కనుక లండన్ వదిలి పెట్టాలని లేదని, తండ్రి చంపుకు తింటున్నాడనీ అన్నాడు. ఇంతలో మైక్ వచ్చాడు. ఒకరికొకర్ని పరిచయం చేశాడు. తన ఇంటికి రావలసిన అతిథి ఈ స్టాన్‌వుడ్డే అని తెలియగానే జమీందారు ఉలిక్కిపడ్డాడు. వంటలక్క వ్యవహారం తన పెద్దకూతురి దగ్గర చెప్తాడేమోనని భయపడ్డాడు. దానికి తోడు హీరో అడలగొట్టాడు – తన ఫ్రెండు నోట్లో నువ్వుగింజ నానదని!

మరెలా? అన్నాడు జమీందారు. ‘మా ఫ్రెండు పేరు మీద నేను వచ్చేస్తాను. కోటలో వారెవవ్వరూ స్టాన్‌వుడ్‌ని చూడలేదు కాబట్టి, నన్ను గుర్తుపట్టేవారు ఎవరూ లేరు కాబట్టి నేనే స్టాన్‌వుడ్‌గా చలామణీ అయిపోతాను. ఇబ్బంది లేదు. నేను మీ మూడో కూతుర్ని ప్రేమిస్తున్నాను. ఈ పేరుతో ఆమెకు దగ్గరగా మసలి, ఆమె అపోహలు పోగొట్టి ఆమె ప్రేమను సంపాదించడమే నా ఉద్దేశ్యం. వీడు లండన్‌లోనే ఉండి ఆ సినీతారను మెప్పించుకుంటాడు. ఈ ప్లానుతో అందరూ సుఖపడతాం’ అన్నాడు మైక్. జమీందారు సరే అన్నాడు. షాపింగు నుంచి తిరిగి వచ్చిన హీరోయిన్‌కి సమస్తం చెప్పాడు. ‘ఎవరెవరో తెలిసినా నీ కోసం నోరు మూసుకుంటానులే’ అంది హీరోయిన్.

వాళ్లు లండన్ నుంచి బయలుదేరుతూండగానే పెద్దల్లుడి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది – వాళ్ల స్టాంపు ఆల్బమ్‌లో అరుదైన స్టాంపు ఒకటి దొరికిందని, దాన్ని అమ్మితే వెయ్యి పౌండ్లు వస్తాయనీ! జమీందారు పొంగిపోయాడు. కానీ కోటకు చేరేసరికి కథ మారిపోయింది. జమీందారుకి ప్రేమలో ప్రత్యర్థి, పరమ కిల్లాడీ అయిన బట్లర్ పెద్ద కూతురు దగ్గరకు వెళ్లి ఆ స్టాంపు ఉన్న ఆల్బమ్ అంతకు ముందు ఓసారి కోటకు అతిథిగా వచ్చిన ఒక అమెరికన్ తనకు బహూకరించినదనీ, తనే ఆ స్టాంపు స్వంతదారుణ్ననీ ఆమెను కన్విన్స్ చేశాడు. కావాలంటే ఆ అమెరికన్ని వెంటబెట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్పిస్తాననీ నమ్మబలికాడు. నాటకాల్లో వేషాలేసే తన మేనల్లుణ్ని తీసుకువచ్చి సదరు అమెరికన్‌గా పరిచయం చేద్దామని అతని ప్లాను.

ఇవేమీ తెలియని పెద్దకూతురు ఆ విషయం తేలేదాకా తండ్రికి కూడా స్టాంపు ఇవ్వనంది. జమీందారుకి ఒళ్లు మండి బట్లర్‌ని ‘నీ ఫ్రాడ్ సంగతి మా అమ్మాయికి చెప్పేస్తా’ అని బెదిరించాడు. ‘అలా అయితే వంటలక్కతో మీ వ్యవహారం మీ పెద్దమ్మాయికి చెపుతా’ అని బెదిరించాడు బట్లర్. ఇంకేమీ చేయలేక, జమీందారు పళ్లు నూరుకుంటూండగా, ఇంట్లో తిష్ట వేసిన నాటక రచయిత అటువేపు వచ్చి, నాటకాల కనక్షన్ కారణంగా తనకు బట్లర్ మేనల్లుడు తెలుసునని చెప్పాడు. దాంతో బట్లర్ ప్లాను అడ్డం తిరిగింది.

కానీ బట్లరుకి డబ్బు సంపాదించేందుకు ఇంకో సాధనం దొరికింది. అతను స్టాన్‌వుడ్ వద్ద ఇదివరకు పనిచేశాడు కాబట్టి అతనెలా ఉంటాడో తెలుసు. ఆ పేరు పెట్టుకుని వచ్చిన మైక్‌ను పట్టుకుని ‘నాకు రెండువందల పౌండ్లు ఇస్తావా, లేదా? లేకపోతే నీ గుట్టు బయట పెడతా’ అని బెదిరించాడు. ‘చెక్కు ఇస్తాను, సంధి చేసుకుందాం’ అన్నాడు హీరో.

చెక్కు రాస్తూండగానే పెద్దకూతురు వచ్చి, ‘ఈ స్టాన్‌వుడ్ నీకిదివరకే తెలుసు కదా’ అంది బట్లర్‌తో. ‘ఆఁ, తెలియక పోవడమేం, అప్పటికీ, ఇప్పటికి పెద్ద మార్పేమీ లేదు’ అన్నాడు బట్లర్, చెక్కు వస్తోంది కదాన్న ధీమాతో! ఆవిడ అలా వెళ్లగా చూసి, హీరో మడతపేచీ వేసాడు. ‘నేనే స్టాన్‌వుడ్‌నని ఆవిడ ముందు చెప్పావు కదా, నేను డబ్బివ్వకపోయినా కాదని చెప్పలేవు. చెక్కు ఇవ్వను ఏం చేస్తావో చేసుకో, ఫో’ అని ఠలాయించాడు. బట్లర్ వెర్రిమొహం వేశాడు.

ఇంతలో లండన్‌లో ఉన్న స్టాన్‌వుడ్‌కి ఇంకో ఉపద్రవం వచ్చిపడింది. ‘నువ్వు మా జమీందారు ఫ్రెండు బీవర్ కోటకి వెళ్లావో లేదోనని నాకు అనుమానంగా ఉంది. ఆ కోట లోపలి గదుల్లో ఉన్నట్టుగా రుజువు కోసం ఫోటోలు తీసి పంపు’ అని తండ్రి హుకుం జారీ చేశాడు. ఇప్పుడిక అక్కడికి వెళ్లక తప్పదు. అసలు పేరుతో వెళదామంటే, తన పేరుతో మైక్ అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఏం చేయాలా అనుకుని బీవర్‌కి వచ్చి, హోటల్లో మకాం వేశాడు. మైక్‌ని కలిసి ఇబ్బంది చెప్పాడు. ఎలాగోలా అతనికి కావలసిన ఫొటోలు తీసి పంపుదామని మైక్ ఐడియా వేస్తుండగా… ఈ బట్లర్ వెళ్లి అతన్ని కలిశాడు. ఆ స్టాంపుల అమెరికన్‌గా వచ్చి నటించి, తనకు స్టాంపు వచ్చేట్లు చేస్తే తను ఫోటోలు తీసి ఇస్తానన్నాడు.

సరేనని స్టాన్‌వుడ్ సదరు అమెరికన్ని తనేనంటూ వచ్చి కోటలోకి దిగాడు. పెద్దల్లుడు అతని దగ్గరకు వచ్చి స్టాంపుల గురించి మాట్లాడితే వాటి గురించి ఏమీ తెలియని యితను వెర్రిమొహం వేశాడు. ఇందులో ఏదో తిరకాసు ఉందని భయపడిన పెద్దల్లుడు ఆ స్టాంపుని లైబ్రరీ లోని ఇనప్పెట్టెలో దాచమని భార్యకు యిచ్చాడు. దాంతో ఆ స్టాంపుని దొంగిలించైనా స్వంతం చేసుకుందా మనుకున్న జమీందారు, హీరోయిన్, హీరో మైక్ ఖంగు తిన్నారు. నీ వల్లే ఇదంతా జరిగిందని మైక్ స్టాన్‌వుడ్‌ని తిట్టిపోశాడు.

అంతా కలిసి ఆలోచించారు. స్టాన్‌వుడ్ హీరో దగ్గర ప్రస్తుతం బట్లర్‌గా చేస్తున్నతను మాజీ దొంగ కదా, అతని చేత ఇనప్పెట్టె తెరిపించి, స్టాంపు కొట్టేదామని ప్లాన్ చేశారు. వాణ్ని రప్పించి బతిమాలేరు. వాడు పోజు కొట్టాడు. గతమంతా తుడిచేసి మంచివాణ్ని అయిపోయానని, ప్రాక్టీసు పోయిందని, కొంచెం మందు కొడితే గానీ పాత ధైర్యం తిరిగి రాదనీ…యిలా! వీళ్లంతా కలిసి కష్టపడి వాణ్ని ఒప్పించారు.

ఆరోజు అర్ధరాత్రి ఇనప్పెట్టె వున్న లైబ్రరీలో అంతా చేరారు, స్టాన్‌వుడ్ తప్ప! మాజీ దొంగ చిత్తుగా తాగి నానా గోల చేశాడు. ఇనప్పెట్టె తెరిచేందుకు కావలసిన సామాన్లు కనబడలేదన్నాడు. జమీందారుని గదిలోంచి పొమ్మన్నాడు. భగ్నమైన తన ప్రేమ పురాణం చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకోడానికి ఒక రిజిస్ట్రార్ ఆఫీసుకి రమ్మంటే తన ప్రియురాలు ఇంకో రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లిందని, ఆ పొరబాటు వారం తర్వాత గుర్తించే సరికి ఆమె మాయమయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతోటి ఇనప్పెట్టెకు సామాన్లు కావాలా…. హెయిర్‌పిన్నుతో తెరిచి పారేస్తానన్నాడు.

ఈ గోలంతా భరించలేక మైక్ వాణ్ని మందలించాడు. దాంతో ఒళ్లు మండి, వాడు సామాన్ల సంచీ కిటికీ లోంచి బయటకు విసిరేశాడు. విసిరేయకుండా అడ్డు పడడానికి వచ్చిన హీరో కంటికి దెబ్బ తగిలింది. మొహం వాచిపోయి అందవికారంగా కనబడగానే అతను హీరోయిన్‌కు నచ్చేశాడు. పైగా అతను కంటికి మందు రాసుకోవడానికి గది బయటకు వెళ్లినప్పుడు, మాజీ దొంగ హీరోయిన్‌కి నచ్చచెప్పాడు – హీరో చాలా బుద్ధిమంతుడని, తక్కిన ఆడవాళ్ల జోలికి పోడని! హీరోయిన్ హృదయం మెత్తబడింది. దెబ్బ తగిలి బాధతో తిరిగి వచ్చిన మైక్ మాజీ దొంగని తన్ని తరిమేశాడు. కంటికి కాపడం పెట్టడానికి వేణ్నీళ్లతో తిరిగివచ్చిన హీరోయిన్ కాపడం పెడుతూండగా హీరో తన ప్రేమ సిన్సియర్ అని చెప్పి ఒప్పించబోయాడు. ఈసారి ఆమె సరేనంది.

అతను గుడ్‌నైట్ చెప్పి వెళ్లిపోయాక హీరోయిన్ ఒక్కతీ కూచుని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూండగా దొంగతనం సజావుగా జరిగిందో లేదో చూద్దామని స్టాన్‌వుడ్ వచ్చాడు! హీరోతో పెళ్లి చేసుకుందా మనుకుంటున్న విషయాన్ని హీరోయిన్ చెప్పగానే సంతోషిస్తూ, తను ప్రేమించిన హాలీవుడ్ సినిమా తారకు, హీరోకు సంబంధం ఉందని ఓ సందర్భంలో అనవసరంగా అనుమానించానని, ఓ రోజు తనిచ్చిన పార్టీలో వాళ్లిద్దరూ సన్నిహితంగా మెలగటం చేత అలా అపోహ పడ్డాననీ, ఇప్పుడీ పెళ్లి వార్త తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందనీ అన్నాడు.

ఈ అసందర్భపు, అధికప్రసంగంతో హీరోయిన్‌కి మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఏడవడం మొదలుపెట్టింది. స్టాన్‌వుడ్ హీరో ఖంగారుపడి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చబోయాడు. ఇంతలో లైబ్రరీలో కలకలం విని, ఏమైందో చూడడానికి పెద్ద కూతురు లైబ్రరీకి వచ్చింది. అంత రాత్రి వేళ వీళ్లిద్దర్నీ సన్నిహితంగా చూసి తెల్లబోయి, ‘మీరేం చేస్తున్నార’ని అడిగింది. స్టాన్‌వుడ్ భయపడిపోయి, ‘మేం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం లెండి’ అనేశాడు. ‘అదెలా సాధ్యం? నువ్వు అమెరికా నుంచి వచ్చి మా చెల్లెల్ని కొన్ని గంటల క్రితమేగా చూశావ్?’ అందావిడ. అలా అంటూనే ఏదో గుర్తుకు తెచ్చుకుని ‘అవునూ, నువ్వు ఆ అమెరికన్‌వైతే కళ్లజోడు ఉండాలిట ఏమయింది?’ అని కూడా అడిగింది.

దాంతో యితను ఖంగారుపడి, ‘నేను అమెరికన్‌ స్టాంపు కలక్టర్‌ని కాను. మా నాన్నగారి టెలిగ్రాం ప్రకారం మీరు ఎదురుచూస్తున్న అతిథిని నేనే. మా ఫ్రెండు మైక్ ప్రాక్టికల్ జోక్ వేసి నా పేరు మీద మీ ఇంటికి వచ్చాడు. నాకు ఇక్కడ పని బడి, మీ బట్లర్ కోరిక మేరకు అమెరికన్ పేరుతో వచ్చా’ అంటూ అన్నీ చెప్పేశాడు. పెద్దకూతురికి ముందు కోపం వచ్చింది. కానీ అతను డబ్బున్నవాడు కాబట్టి, దూరపు బంధువు కాబట్టి, చెల్లెల్ని పెళ్లాడతానంటున్నాడు కాబట్టి సంతోషించి వెళ్లిపోయింది.

మర్నాడు పొద్దున్న జమీందారుకి మూడ్ చెడిపోయింది. రెండో కూతురు వచ్చి నాటక రచయితను పెళ్లాడతానని, పెద్ద అల్లుడి లాగానే యితనూ యిల్లరికం ఉంటానన్నాడని, యిద్దరూ కోటలోనే శాశ్వతంగా ఉంటామనీ చెప్పింది. మూడో కూతురు చూడబోతే అందమైన హీరో మైక్‌ను వదిలిపెట్టి పెద్ద అందంగా లేని సైడు హీరో స్టాన్‌వుడ్‌ని పెళ్లాడతానంటోంది. వెయ్యి పౌండ్లు తెచ్చిపెడుతుందనుకున్న స్టాంపు దొంగతనం ఓ ప్రహసనంగా మారింది. చికాకు పుట్టి లండన్‌కి ప్రయాణం కట్టాడు, చిన్నకూతురితో సహా! మైక్, స్టాన్‌వుడ్ కూడా లండన్‌కు విడివిడిగా బయలు దేరారు.

లండన్‌లో జమీందారు బార్‌లో రిలాక్సవుతూండగా హీరోయిన్ షాపింగ్‌కి బయలుదేరింది. రోడ్డు మీద స్టాన్‌వుడ్ కనబడ్డాడు. సినీతార, మైక్ కలిసి లండన్‌లోనే ఫచార్లు కొడుతున్నారని చెప్పాడు. దానికి తగ్గట్టుగా వాళ్లిద్దరూ జంటగా హోటల్లోకి వెళుతూ వీళ్ల కంటబడ్డారు. దాంతో హీరోయిన్‌కి ఒళ్లు మండిపోయింది. మనస్సులో హీరోపై వున్న కాస్త నమ్మకమూ పోయింది. లండన్ వదిలి, బీవర్ కోటకు తిరిగివచ్చింది.

ఈ లోపున ఇక్కడ పెద్దకూతురు బట్లర్‌తో ‘నువ్వు స్టాంపు కొట్టేయడానికి, ఎవణ్నో అమెరికన్‌ అంటూ తీసుకుని వచ్చి మోసం చేయబోయావు. ఉద్యోగం లోంచి తీసేశాను పో’ అంది. అతనేమీ చింతించలేదు. ఎందుకంటే అతనికి అవాళే గుర్రప్పందాలలో గెలిచినట్లు తెలిసింది.

ఇంతలో మాజీ దొంగకు మత్తు దిగింది. సామాన్లు తెప్పించుకుని మళ్లీ ఇంకో ప్రయత్నం చేసి తన నిజాయితీ చూపించుకుంటానని జమీందారుకి మాటిచ్చి రంగంలోకి దిగాడు.

హీరో మైక్ లండన్ నుంచి తిరిగి వచ్చి హీరోయిన్‌ను కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడబోతే ఆమె తిట్టిపోసింది. ‘ఆ సినీతారతో నాకు ఉన్నది బిజినెస్ డీల్ మాత్రమే. కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి మాత్రమే ఆమెను హోటల్‌కి తీసుకెళ్లాను. కావాలంటే డీల్ చూడు’ అని అతను వివరించాడు. హీరోయిన్ సమాధానపడింది. సరే నిన్నే పెళ్లాడతాలే అంది. ఇంతలోనే సినీతార కూడా స్టాన్‌వుడ్‌కి ఫోన్ చేసి అతన్ని పెళ్లాడడానికి రెడీయేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా స్టాంపు సంగతేమిటని జమీందారు వాపోతూండగా మాజీ దొంగ వచ్చి పనయిపోయిందని చెప్పాడు. పూర్తి వివరాలు అడగ బోతూండగానే పెద్దకూతురు వచ్చి తండ్రిని ఝాడించ బోయింది. స్టాంపు చేతి కొచ్చిందన్న ధైర్యంతో జమీందారు తిరగబడి, ఆమెను తిట్టి కోట లోంచి బయటకు పొమ్మన్నాడు. ఇకపై యిల్లరికాలు లేవు, వంటావిణ్ని పెళ్లి చేసుకుని నేనే యిల్లు చూసుకుంటా అని ప్రకటించేశాడు కూడా. ఆమెకు మతి పోయి, మారు మాటాడక వెళ్లిపోయింది.

అప్పుడు మాజీ దొంగ చెప్పాడు. మీరు వంటావిణ్ని పెళ్లి చేసుకోలేరండీ అని. ‘రిజిస్ట్రార్ ఆఫీసు కన్‌ఫ్యూజన్ కారణంగా నాతో పెళ్లి తప్పిపోయిన ప్రియురాలు వేరెవరో కాదు, ఈ వంటలక్కే! స్టాంపు దొంగిలించి బయటకు వస్తూండగా తను నా కంటబడింది. ఇద్దరి మధ్య అపోహలు తొలగి పోయాయి. మేమిద్దరం పెళ్లాడడానికి నిశ్చయించు కున్నాం.’ అన్నాడు.

జమీందారు హతాశుడై పోయాడు. ‘పోనీ నా స్టాంపైనా నాకు తగలెయ్’ అన్నాడు. ‘ఇనప్పెట్టె తెరిచి, ఎవరి కంటా పడకూడదని, ఆ స్టాంపును నాలిక మీద అంటించుకుని బయటకు తెచ్చాను. కానీ హఠాత్తుగా, అనుకోని చోట నా పాత ప్రియురాలు వంటలక్క కనబడిన ఎక్సయిట్‌మెంట్‌లో గుటకలు మింగుతూ, స్టాంపు కూడా మింగేశా’ అని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు..

మోసం జరిగిందని ఆక్రోశించాడు జమీందారు. హీరో ధైర్యం చెప్పాడు. ‘మేం పెళ్లి చేసుకుని హాలీవుడ్ వెళ్లిపోతాం. మాతో వచ్చేయండి. మీరు అచ్చు బట్లర్లా కనబడతారు. కనుక హాలీవుడ్ సినిమాల్లో బట్లర్ వేషాలిప్పిస్తాను. భుక్తికి లోటు లేదు, స్వతంత్రంగా బతకవచ్చు’ అని. రైఠో అనేశాడు జమీందారు. ఇదీ కథ.

– ఎమ్బీయస్ ప్రసాద్

mbsprasad@gmail.com

16 Replies to “ఎమ్బీయస్‍: స్ప్రింగ్ ఫీవర్”

    1. బట్లర్ అవ్వడు. హాలీవుడ్ సినిమాల్లో బట్లర్ వేషం వేస్తానన్నాడు. ఆ డబ్బుపై పెద్ద కూతురి ఆంక్షలేమీ లేకుండా హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చని అతని కాలిక్యులేషన్

  1. కథ బాగుంది చాల ట్విస్టులు , కాకుంటే పెద్ద కూతురిని తరిమేయటం బాలేదు , జమీందారు బట్లర్ వేషాల కోసం వెళ్ళిపోతున్నాడు కదా మరి ఇంకా ఆ పెద్దకూతురిని తరిమేయటం ఎందుకో…

  2. టైటిల్ కి స్టోరీ కి ఏమైనా రిలేషన్ ఉండిందా మాస్టారు.. లేకపోతే మన తెలుగు సినిమా టైటిల్ కి స్టోరీ కి రిలేషన్ లేనట్టు ఇక్కడ కూడా అంతే నా..

  3. Any Rond book “Atlas Shrugged” మీద ఆర్టికల్ రాయగలరు. అది 1400 పేజీల పుస్తకం, ఆఫీసు పిల్లలు, నా పరీక్షలు, పెళ్లి పేరంటాల ప్రయాణాలు, పుస్తకం పూర్తి చేయలేక పోతున్నాను.

  4. “Atlas Shrugged” మీద ఆర్టికల్ రాయగలరు. అది 1400 పేజీల పుస్తకం, ఆఫీసు పిల్లలు, నా పరీక్షలు, పెళ్లి పేరంటాల ప్రయాణాలు, పుస్తకం పూర్తి చేయలేక పోతున్నాను.

    1. నాకు అయాన్ ర్యాండ్‌ భావాలపై సదభిప్రాయం లేదు. పైగా అంత పుస్తకం చదివే ఓపికా లేదు. సగం ఆర్టికల్స్ పాలిటిక్స్ మీద రాస్తున్నాను కాబట్టి తక్కినవి యీజీ రీడింగ్ టాపిక్స్ వెతికి అందిస్తున్నాను.

Comments are closed.