పాత అనంతపురం జిల్లా నుంచి కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణను మంత్రి పదవి నుంచి తప్పించారు. అదే జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మహిళకు అవకాశం ఇచ్చారు. ఇలా కురుబ కోటాకే మంత్రిని ఇచ్చారు. ఇదే సమయంలో శంకర్ నారాయణను కూడా నిరాశ పరచనీయకుండా, శ్రీ సత్యసాయి జిల్లాకు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
ఇక సత్యసాయి జిల్లా ఇన్ చార్జి మంత్రిగా కర్నూలు జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాంను నియమించారు. బోయ సామాజికవర్గానికి చెందిన మంత్రిని బోయల డెన్సిటీ బాగా ఉన్న ప్రాంతానికి ఇన్ చార్జిగా నియమించారు.
మొత్తానికి జగన్ సామాజికవర్గ సమీకరణాలకు గట్టి ప్రాధాన్యతనే ఇస్తున్నారు. అందులో కూడా బీసీల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యపూరితంగా లేకుండా, అడుగడుగునా వ్యూహాలు గట్టిగా అమలు చేస్తూ ఉన్నారు.
గత ఎన్నికల్లో అనంతపురం వంటి జిల్లాలో బీసీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఓట్ షేర్ లభించింది. అనంతపురం ఎంపీ, హిందూపురం ఎంపీ టికెట్ తో పాటు పలు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించడంతో పాటు బీసీలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు వైఎస్ జగన్. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు లభించిన భారీ మెజారిటీలు బీసీల్లో వచ్చిన మార్పుకు నిదర్శనం.
అలా అంది వచ్చిన మార్పును జగన్ లైట్ తీసుకోవడానికి సుముఖంగా లేడని స్పష్టం అవుతోంది. బీసీలకు ప్రాధాన్యత అనేది నోటి మాటగా కాకుండా, ఆచరణలో చూపుతూ.. ఆ వర్గాల నుంచి నూతన తరం నేతలను తయారు చేయడంలో జగన్ శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు.