ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చోడవరంలో నిర్వహించిన బహిరంగ సభకు జనాలు పెద్ద ఎత్తున పోటెత్తారు. చోడవరంలో అడుగడుగునా జన స్పందన కనిపించింది. చోడవరంలో టీడీపీ ఎక్కువ సార్లు గెలిచింది. 2019లో వైసీపీ పరం అయిన ఈ నియోజకవర్గం ఈసారి కూడా ఫ్యాన్ నీడకు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అవతల పక్షం నుంచి పాత ప్రత్యర్ధి రాజు ఢీ కొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యన ఇది వరసగా నాలుగవ పోరు. 2009 నుంచి ఇద్దరూ పోటీ పడితే రెండు సార్లు రాజు గెలిచారు. ఒకసారి ధర్మశ్రీ గెలిచారు. ఈసారి దానిని సమం చేస్తామని ధర్మశ్రీ వర్గం ధీమాగా చెబుతోంది.
చోడవరంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ధర్మశ్రీకి ఆ వర్గంతో పాటు బీసీల నుంచి కూడా మంచి మద్దతు దక్కుతోంది అని అంటున్నారు. టీడీపీ కూటమిలో లుకలుకలు కూడా మేలు చేస్తున్నాయని చెబుతున్నారు. జనసేన నుంచి సీటు ఆశించి భంగపడిన వారు ఉన్నారు. టీడీపీలో మరో బలమైన సామాజిక వర్గం సీటు కోరుకున్నా దక్కలేదు.
ధర్మశ్రీ విషయం తీసుకుంటే ఆయనకు రెండేళ్ళ క్రితమే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనంలోనే ఉంటూ వస్తున్నారు. జగన్ సభ మండుటెండలో పెట్టినా జనాలు భారీ ఎత్తున తరలి రావడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గత ఎన్నికల కంటే మంచి మెజారిటీతో గెలుస్తామని వారు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కూడా చంద్రబాబు మీద సెటైర్లు పేల్చారు. రైతంగానికి తాను ఎంతో మేలు చేసాను అని వరుణుడు తమ ప్రభుత్వంలో దయదలచి కరుణిస్తున్నారని, బాబు వస్తే ఏ పధకాలు భరోసాలూ ఉండకపోగా వానలు కూడా పడవని హెచ్చరించారు. మేలు చేసిన వారినే ఎన్నుకోవడం మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. చోడవరంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభ చూసిన తరువాత వైసీపీకి సానుకూల వాతావరణం బాగా ఉందని అంటున్నారు.