మాడుగుల ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటి సీటులో ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆరు సార్లు గెలిచిన సీటు. టీడీపీ విజయానికి 2004లో కాంగ్రెస్ బ్రేక్ వేస్తే 2014 నుంచి వైసీపీ రెండు సార్లు గెలిచి సత్తా చాటింది.
మాడుగులలో మరోసారి గెలిచేది వైసీపీనే అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అంటున్నారు. మాడుగుల ప్రజలకు జగన్ని గుండెల్లో పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన పంచాయతీ రాజ్ శాఖ ను తనకు కేటాయించారని, ఉప ముఖ్యమంత్రిని చేశారని మాడుగుల మీద జగన్ కి ఉన్న అభిమానానికి అది నిదర్శనం అని బూడి ముత్యాలనాయుడు అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక సార్లు చూశారని, చంద్రబాబు తీరు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముందని బూడి అంటున్నారు. చంద్రబాబు చెప్పిన మాటలను చేసిన దాఖలాలు లేవని, జగన్ ఏమైతే చెప్పారో అదే అమలు చేస్తున్నారు అని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి మాడుగుల సీటులో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్ కి బహుమతిగా ఇద్దామని ఆయన ప్రజలను కోరారు. మాడుగులలో మూడవ విడత ఆసరా పధకం కింద నగదు బదిలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా పంటి బిగువున వాటిని భరించి ప్రతీ పధకాన్ని క్యాలెండర్ ప్రకారం తుచ తప్పకుండా ఆచరించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే అని నొక్కి చెప్పారు.
అటువంటి జగన్ పాలనను మళ్ళీ తెచ్చుకోవడానికి మాడుగుల ప్రజలే ముందుండాలని ఆయన కోరారు. ఏపీకే మాడుగుల ఆదర్శం కావాలన్నారు. మాడుగుల సభకి మహిళలంతా పెద్ద ఎత్తున పోటెత్తడం విశేషం. మాడుగులలో రాజకీయంగా చూసినా వైసీపీ బలంగా ఉంది. హ్యాట్రిక్ విజయం ఖాయమని బూడి ముత్యాలనాయుడు విశ్వాసంతో ఉన్నారు. మాడుగుల హల్వా మళ్లీ జగన్ దే అని అంటున్నారు.