నీట్ మెరిట్ విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే హైకోర్టు తీర్పు!

ఇంత వ‌ర‌కూ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల‌లో చేర‌ని నీట్ విద్యార్థుల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

నీట్ మెరిట్ విద్యార్థుల‌కు గొప్ప ఊర‌ట‌నిచ్చేలా ఏపీ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. నీట్ అడ్మిష‌న్లు పూర్త‌యిన త‌ర్వాత‌, అనూహ్యంగా క‌న్వీన‌ర్ కోటా కింద 76 మెడిసిన్ సీట్లు పెరిగాయి. ఈ సీట్ల భ‌ర్తీ ప్ర‌క్రియ లోప‌భూయిష్టంగా చేప‌ట్ట‌డంపై కోర్టును కొంద‌రు ఆశ్ర‌యించారు. దీంతో ఏపీ హైకోర్టు మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఆదేశాలు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి.

పెరిగిన 76 క‌న్వీన‌ర్ సీట్ల‌లో ఒక సీటును క‌ర్నూలు మెడికల్ క‌ళాశాల‌లో విద్యార్థినికి కేటాయించాల‌ని ఇప్ప‌టికే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మిగిలిన 75 సీట్ల‌లో ఎస్వీయూ ప‌రిధిలో 50, ఏయూ ప‌రిధిలో 25 ఉన్నాయి. ఇందులో అమ‌లాపురంలోని కోన‌సీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, రీసెర్చ్ ఫౌండేష‌న్ వైద్య‌క‌ళాశాల‌లో 25 సీట్లు, క‌ర్నూలులోని విశ్వ‌భార‌తీ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 50 సీట్లు క‌న్వీన‌ర్ కోటా పెర‌గ‌డం విశేషం.

ఈ సీట్ల భ‌ర్తీలో మెలిక ఏంటంటే…స్పెష‌ల్ స్టే వేకెన్సీ రౌండ్‌లో భ‌ర్తీ చేయాల‌ని అనుకోవ‌డం. ఇంత వ‌ర‌కూ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ల‌లో చేర‌ని నీట్ విద్యార్థుల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో మెరిట్ విద్యార్థుల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం వుంది.

ఈ నేప‌థ్యంలో ఏపీ హైకోర్టు త‌క్ష‌ణం స్పందించింది. రెండు వైద్య క‌శాల‌ల్లో పెంచిన 76 అద‌న‌పు సీట్ల‌ను రెగ్యుల‌ర్ కౌన్సెలింగ్‌లోనే భ‌ర్తీ చేయాల‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. నీట్ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగానే అభ్య‌ర్థులంద‌రికీ కౌన్సెలింగ్లో పాల్గొనే అవ‌కాశమిస్తూ భ‌ర్తీ చేయ‌డం స‌బ‌బు అని హైకోర్టు పేర్కొంది. క‌ర్నూలు మెడిక‌ల్ క‌ళాశాల‌లో విద్యార్థినికి సీటు ఇవ్వాల‌నే త‌మ ఆదేశాల్ని కూడా క‌లుపుకుని ప్ర‌తిభ ఉన్న వారిని ఆ 76 సీట్ల‌లో పాల్గొనే అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే, త‌క్కువ ప్ర‌తిభావంతుల‌కు అవి ద‌క్కుతాయ‌ని కోర్టు పేర్కొంది. దీంతో మెడిసిన్ సీటు రాక‌పోవ‌డంతో బీడీఎస్‌, ఇత‌ర కోర్సుల్లో చేరిన విద్యార్థుల‌కు వైద్య‌విద్య చ‌దివే అవ‌కాశం ద‌క్క‌నుంది.

2 Replies to “నీట్ మెరిట్ విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే హైకోర్టు తీర్పు!”

Comments are closed.