జగన్ ప్రభుత్వానికి సీపీఎస్ ఓ పెద్ద సమస్య అయ్యి కూచుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పదేపదే తాము అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా అప్పట్లో అవగాహన లేకపోవడంతో జగన్ హామీ ఇచ్చారని అధికార పార్టీ నేతలు యూటర్న్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్‌పై మధ్యే మార్గంగా ఏదో ఒకటి చేయాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త గ్యారెంటీ పింఛను స్కీమ్ (జీపీఎస్) తీసుకొచ్చేందుకు రూపకల్పన చేసింది. ఇందుకు ఉద్యోగ సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం తన ప్రయత్నాల్ని కొనసాగిస్తోంది. ఇవాళ సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చర్చలు జరిపారు. జీపీఎస్‌కు అంగీకరించాలని ఉద్యోగ సంఘాల నేతలపై మంత్రులు ఒత్తిడి తెచ్చారు.
చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్ పునరుద్ధరణ తప్ప, మరొక దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. జీపీఎస్ గురించి మాట్లాడాలని అనుకుంటే ఇక మీదట అసలు పిలవొద్దని మంత్రులకు స్పష్టం చేసినట్టు ఏపీసీపీఎస్‌యూఎస్ అధ్యక్షుడు మరియదాస్ తెలిపారు.
అయితే పాత పింఛన్ విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని మంత్రులు తమకు తేల్చి చెప్పినట్టు ఆయన వెల్లడించారు. దీంతో సీపీఎస్ వ్యవహారం ఎటూ తేలకుండా పోయింది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాల నేతలు పట్టింపులకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. తమ డిమాండ్లపై ఎవరూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.