తిరుమలకు వచ్చే భక్తులపై తమ సిబ్బంది అంచనా తప్పిందని ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారు. ఇటీవల సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం తీవ్ర విమర్శలపాలైంది.
ఉద్దేశపూర్వకంగానే హిందూ భక్తులను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనే వాదనను ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చాయి. అయితే టీటీడీ, ప్రభుత్వానికి ఎక్కువ డ్యామేజీ కలకుండా టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు స్లాట్బుకింగ్తో సంబంధం లేకుండా నేరుగా కలియుగ దైవాన్ని దర్శించుకునేలా టీటీడీ అనుమతించింది. ఇక మీదట తొక్కిసలాట లాంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. తిరుమలకు భక్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీటీడీ విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగిందని అంగీకరించారు. భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా ఎత్తివేశామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులను కంపార్ట్మెంట్లలో ఉంచి దర్శనానికి అనుమతి ఇస్తున్నామన్నారు. వేసవిలో రద్దీ ఎక్కువగా వుంటుందని, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లను కూడా పకడ్బందీగా చేసినట్టు వైవీ తెలిపారు.