ఆయన వయసు చిన్నది. రాజకీయ అనుభవం కూడా తక్కువ. అయితేనేమి బలమైన రాజకీయ కుటుంబం వెనకాల ఉంది. అంతే బలమైన సామాజిక నేపధ్యం కూడా అండగా ఉంది. అందుకే అనకాపల్లి కొత్త జిల్లా నుంచి గుడివాడ అమరనాధ్ మంత్రి అయిపోయారు.
ఇక ఆయనకు ఒకటీ రెండూ కాదు అయిదు ప్రధాన శాఖలను జగన్ కట్టబెట్టారు. అందులో పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాలు, చేనేల జౌలు శాఖలు, వాణిజ్య పన్నుల శాఖ కూడా అమరనాధ్ కే ఇచ్చేశారు. అప్పుడెప్పుడో కొడుకు లోకేష్ కోసం తండ్రి చంద్రబాబు అభిమానంగా అయిదు కీలకమైన శాఖలు ఇచ్చేశారు.
ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేశారు. అది వారి సొంత పార్టీ, తన రాజకీయ వారసుడి కోసం అలా చేశారు. కానీ జగన్ ఇక్కడ కేవలం అభిమానంతోనే గుడివాడకు ఇన్నేసి శాఖలు ఇచ్చేశారు అంటున్నారు.
ఉన్నత విద్యావంతుడైన గుడివాడ ఈ శాఖల బరువు మోయగలడు అనే జగన్ ఇచ్చారని చెబుతున్నారు. అదే టైమ్ లో మిగిలిన వారికి అసూయ కలిగేలా ఇన్ని శాఖలు ఒక్క గుడివాడకే కేటాయించడం జరిగింది అని అంటున్నారు. దీని మీద గుడివాడ మీడియాతో మాట్లాడుతూ జగన్ అభిమానం ఇంత బరువుగా ఉందని చమత్కరించారు.
తన మీద అధినాయకుడు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, అన్ని శాఖలను సమర్ధంగా నిభాయిస్తాను, బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిని మంచి పేరు తెస్తాను అని మాట ఇచ్చేశారు.
మొత్తానికి గుడివాడ మీద పెద్ద బరువు పెట్టిన జగన్ చాలానే కోరుకున్నారు. మరి తన పనీతీరుతో రుణం తీర్చుకోవడం ద్వారా బరువు దించుకోవాలి. లేకపోతే బరువైపోతారు సుమా.