విశాఖ ఏపీలో పెద్ద నగరం. దీనిలో రెండవ మాటకు తావే లేదు. అటువంటి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అది కుదరలేదు. దానికి వారు చెప్పే కారణాలు ఎలా ఉన్నా అనుకున్నది అయితే చేయలేకపోయారు.
అయితే విశాఖ రాజధాని అన్న ముసుగులో దందాలకు తెర తీశారని పెద్ద ఎత్తున భూ కబ్జాలు విశాఖలో చోటు చేసుకున్నాయని ఆనాడూ ఈనాడూ టీడీపీ సహా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు అయితే రెండు లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జా అయ్యాయని చెబుతున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో కబ్జాకు గురి అయితే దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరముంది. వేల కోట్ల భూములు దురాక్రమణకు గురి అయ్యాయని అంటున్నారు. అయితే అన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి.
ఏపీలో అత్యంత ఎక్కువగా ప్రభుత్వ భూముల కొరతను ఎదుర్కొంటున్న జిల్లా విశాఖ మాత్రమే. అయినా భూములు దందాలు గురి అయ్యాయి అంటే అవి అసైన్డ్ భూములు బంజరు భూములు లేక ప్రైవేట్ భూములుగా కూడా చూడాల్సి ఉంటుంది.
ఈ భూదందా అన్నది ఇవాళ స్టార్ట్ కాలేదు. 2000 సంవత్సరం తరువాత నుంచి భూములకు రెక్కలు వచ్చాయి. అది ఏపీ వ్యాప్తంగా జరిగింది. అలా అపుడూ పెద్ద సిటీలలో దందాలు చోటు చేసుకున్నాయి. విభజన తరువాత అది మరింత ఎక్కువ అయింది. గత పదేళ్లలో జరిగిన భూ దందా ఎన్నడూ చూడలేదని అంటున్నారు.
ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూముల దందా కూడా సాగిందని ఆ శాఖ మంత్రి చెబుతున్నారు. ఈ భూ దందాల మీద ప్రకటనలు చర్చలకూ పుణ్య కాలం పోతోంది. ఇలా జరుగుతూ ఉంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని మేధావులు అంటున్నారు.
విశాఖ అంటే కబ్జాకోర్లకు నిలయం అన్న అపవాదు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉందని అంటున్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.