ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక పట్టాన ఆయన మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంలో సలహాదారులున్నారు. కానీ ఆలోచించేది, నిర్ణయాలు తీసుకునేది మాత్రం జగనే అని జగమెరిగిన సత్యం. తాజాగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై రోజుకో ప్రచారం తెరపైకి వస్తోంది. గతంలో సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంలో సగం పాలన పూర్తయిన తర్వాత కొత్త వారికి చాన్స్ ఇస్తానని జగన్ ప్రకటించారు.
ఆ మాట ప్రకారమే కొత్త కేబినెట్ కూర్పునకు జగన్ శ్రీకారం చుట్టారు. నిర్ణయాలు తీసుకోవడమే ఆలస్యం, అమల్లో జగన్ జెట్ వేగంతో పోటీ పడతారు. గురువారం తొలి కేబినెట్ చివరి సమావేశం జరిగింది. అందరి రాజీనామాలు తీసుకున్నారు. నిన్నటి వరకూ నలుగురు మంత్రులు మాత్రమే కొనసాగుతారనే ప్రచారం ఉధృతంగా సాగింది.
అయితే పాతకేబినెట్‌లోని 10 నుంచి 11 మంది మంత్రులు తిరిగి కొనసాగుతారని ప్రభుత్వ సన్నిహిత మీడియా ఉప్పందించింది. దీంతో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టైంది. గత కొన్ని రోజులుగా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతున్న పేర్లలో భారీ కోత పడింది.
పాత కేబినెట్‌కు చెందిన 10-11 మంది మంత్రులు కొనసాగుతారనే ప్రచారంతో, ఆశావహుల్లో ఒక్కసారిగా తీవ్ర నిరాశ. ముఖ్యం గా శుక్రవారం తెల్లవారే సరికి కేబినెట్ కూర్పుపై పూర్తిగా వాతావరణం మారింది. గత కొన్ని రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పక వస్తుందని చెబుతున్న వాళ్లకు శుక్రవారం మారిన రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా నీరుగారిపోతున్నట్టు సమాచారం.
అసలు జగన్ మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదనే చర్చ జరుగుతోంది. జగన్‌ను ప్రసన్నం చేసుకోడానికి బదులు ప్రసిద్ధ దేవాలయాల చుట్టూ ఎమ్మెల్యేలు తిరుగుతుండడం చర్చనీయాంశమైంది. జగన్ అంతరంగాన్ని ఏ మీడియా కూడా పసిగట్టలేక పోతోందనేందుకు ఏపీ తాజా రాజకీయ పరిస్థితులే నిదర్శనం.