తెలంగాణ గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సర్కార్ అమర్యాదగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం ద్వారా విభేదాలు తారాస్థాయికి చేరినట్టైంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్‌పై గవర్నర్ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్‌పై కేసీఆర్ సర్కార్ ఎదురు దాడికి దిగింది. ఇప్పటికే గవర్నర్ వ్యాఖ్యలపై కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర కీలక మంత్రి కేటీఆర్ స్పందించారు. తమకు గవర్నర్‌తో పేచీ లేదని, అంతా ఆమే ఊహించుకుంటున్నారని లైట్ తీసుకున్నారు. తాజాగా మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్‌పై ఫైర్ అయ్యారు.
గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. తమిళసై వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారన్న ఘాటు విమర్శ చేశారు. ప్రభుత్వం ఎక్కడ అవమానపర్చిందో గవర్నర్ చెప్పాలని మంత్రి నిలదీశారు. గవర్నర్ తన పరిధిలో వుంటే అందరూ గౌరవిస్తారన్నారు. ఉగాది నాడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గవర్నర్ యాదాద్రికి వెళ్లారన్నారు. కేవలం 20 నిమిషాలు ముందు చెబితే ప్రొటోకాల్ పాటించడం కష్టమవుతుందన్నారు.
ఈ విషయాన్ని గవర్నర్ గుర్తించకపోవడం శోచనీయమన్నారు. గవర్నర్ హోదాలో రాజ్యాంగబద్ధంగా తమిళిసై వ్యవహరిస్తే బాగుంటుందని మంత్రి హితవు చెప్పారు. గతంలో గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని గుర్తు చేశారు. అంతేకాదు, రాష్ట్రాభివృద్ధిలో నరసింహన్ భాగస్వాములయ్యారన్నారు. నరసింహన్‌తో పోల్చడం ద్వారా , తమిళిసై అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పినట్టైంది.