ఫ్రీబ‌స్సుపై.. మ‌హిళ‌లు బ‌స్సెక్కి వినూత్న నిర‌స‌న‌!

ఎవ‌రైనా టికెట్ అడిగితే, చంద్ర‌న్న చెప్పారు, ఉచితంగా తీసుకెళ్లాలని సూచించ‌డాన్ని వైసీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు గుర్తు చేశారు.

ఫ్రీ బ‌స్సుపై తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ మ‌హిళ‌లు వినూత్న నిర‌స‌న తెలిపారు. తిరుప‌తి ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వైసీపీ ఇన్‌చార్జ్ భూమ‌న అభిన‌య్ నేతృత్వంలో మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌తో పాటు ప‌లువురు పార్టీ మ‌హిళ‌లు వెళ్లారు. అలాగే చంద్ర‌బాబు మాస్క్‌తో ఓ వ్య‌క్తి కూడా ఉండ‌డం విశేషం. తిరుప‌తి నుంచి పీలేరు వెళ్లే బ‌స్సు ఎక్కారు. కండ‌క్ట‌ర్ టికెట్ డ‌బ్బు అడ‌గ్గా, మ‌హిళ‌లంతా గ‌తంలో మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తాన‌ని చంద్ర‌బాబు ఆర్భాటంగా చేసిన ప్ర‌సంగాన్ని బ‌స్సులో ప్ర‌ద‌ర్శించారు.

ఎవ‌రైనా టికెట్ అడిగితే, చంద్ర‌న్న చెప్పారు, ఉచితంగా తీసుకెళ్లాలని సూచించ‌డాన్ని వైసీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు గుర్తు చేశారు. బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను ఉద్దేశించి వైసీపీ మ‌హిళ‌లు మాట్లాడుతూ ఉచిత ప్ర‌యాణం పేరుతో హామీ ఇచ్చి, చంద్ర‌బాబు ఓట్లు వేయించుకుని, గ‌ద్దెనెక్కి మోస‌గించార‌ని తూర్పార‌ప‌ట్టారు.

సూప‌ర్‌సిక్స్‌లోని ఒక్కో ప‌థ‌కం గురించి చెబుతూ, ఎటూ ఏవీ ఇవ్వ‌లేద‌ని, క‌నీసం ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని మ‌హిళ‌లంతా ముక్త‌కంఠంతో నిన‌దించారు. చంద్ర‌బాబు మాస్క్‌లో ఉన్న వ్య‌క్తిని మ‌హిళ‌లు గ‌ట్టిగా నిల‌దీశారు. ఇంత మోసం చేస్తావా చంద్ర‌బాబు అంటూ నిల‌దీశారు. తాము అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని చెప్పి, అధికారంలోకి వ‌చ్చి ఇలా చేశావేంద‌య్యా బాబూ అని మ‌హిళ‌లు నిల‌దీయ‌డం ఆక‌ట్టుకుంది.

చంద్ర‌బాబు ఇచ్చిన ఫ్రీబ‌స్సు హామీ అమ‌లుకు నోచుకోక‌పోవ‌డంపై తిరుప‌తిలో వైసీపీ మ‌హిళ‌లు చేప‌ట్టిన వినూత్న నిర‌స‌నను ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర్శంగా తీసుకుంటే ప్ర‌భుత్వానికి చుక్క‌లు క‌నిపిస్తాయి. వైఎస్ జ‌గ‌న్ ఇలాంటి వినూత్న నిర‌స‌న‌ల‌కు దిగితే, వైసీపీకి మైలేజ్ పెర‌గ‌డంతో పాటు ప్ర‌భుత్వం బ‌ద్నాం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదిలా వుండ‌గా ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు మేర‌కు పోలీసులు బ‌స్టాండ్‌కు వెళ్లి వైసీపీ కార్య‌క‌ర్త‌లు,నాయ‌కుల్ని అదుపులోకి తీసుకున్నారు.

22 Replies to “ఫ్రీబ‌స్సుపై.. మ‌హిళ‌లు బ‌స్సెక్కి వినూత్న నిర‌స‌న‌!”

Comments are closed.