‘ఏదైనా పథకం ప్రారంభిస్తే పత్రికలకు ప్రకటనలు ఇస్తారు! లేదా… ఏదైనా సాగునీటి ప్రాజెక్టునో, పరిశ్రమనో ప్రారంభించినా ప్రభుత్వ విజయాన్ని ప్రకటనల ద్వారా ప్రజలకు చాటి చెప్పుకోవచ్చు. కానీ… ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రకటనల పరమా ర్థమేమిటో ఎవ్వరికీ అర్థం కా వడంలేదు’…. ‘ప్రకటనల పరమార్థం!’ శీర్షికతో రాసిన వార్తలోని లీడ్ వాక్యాలివి.
ఆంధ్రజ్యోతి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. శత్రువులు, ప్రత్యర్థులు కూడా కాదనలేని ‘అక్షర’ సత్యం. ఇంకా ఈ కథనంలోని ఆణిముత్యాలను తప్పక తెలుసుకోవాలి.
‘సర్కార్ పెద్దల ‘సొంత మీడియా’కు ప్రభుత్వ సొమ్ముతో ఆర్థిక చే యూత ఇచ్చేందుకే ప్రకటనలు జారీ చేస్తున్నారా… అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సొంత పత్రికకు మాత్రమే ఇస్తేవిమర్శలు వస్తాయనే ఉద్దేశంతో మరో పత్రికను కూడా కలుపుకొని ప్రకటనలు ఇస్తున్నారన్న అభిప్రాయం నెలకొంది’
సర్కార్ పెద్దల సొంత మీడియా అంటే సాక్షితో పాటు మరో పత్రిక అంటే ఈనాడుకు ప్రకటనలు ఇస్తున్నారనేది ఈ వార్త సారాంశం. ఇంకా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి కడుపు మంట. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈనాడు కంటే ఎక్కువగా ప్రకటనల రూపంలో దోచుకున్న సొమ్ము మాటేమిటి? అప్పట్లో తమకు ఇదే రీతిలో ప్రకటనలు ఇస్తూ ఆంధ్రజ్యోతికి అజీర్ణం అయ్యేలా, సాక్షి కడుపు మాడ్చినప్పుడు రాయడానికి కలాల్లో సిరా అయిపోయిందా?
ఎంత కాదన్నా ఈనాడుకు అంతోఇంతో జర్నలిజం విలువలు ఉండటం వల్లే ఆ పత్రికకు జగన్ సర్కార్ ప్రకటనలు ఇస్తున్నట్టుగా గుర్తించాలి. కానీ ఆంధ్రజ్యోతి పరిస్థితి అది కాదు. అదో చంద్రజ్యోతి, అంధజ్యోతి అనే ముద్రపడింది. దీనికి యాజమాన్య స్వయంకృతాపరాధమే కారణం. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రాసే కొత్త పలుకు ఏ జర్నలిజం విలువలను పాటిస్తోందో ఎవరైనా చెప్పగలరా?
ఆంధ్రజ్యోతి అనేది పత్రిక అనుకోవడం ఎలా ఉంటుందంటే… నేతిబీరకాయలో నెయ్యి , ఎండమావుల్లో తేమను నిజమనుకోవడం ఒక్కటే. ఎప్పుడైతే చంద్రబాబు కోసం ఆ పత్రిక రాతలు రాయడం మొదలు పెట్టిందో…ఆ రోజే అందులోని జర్నలిజం చచ్చిపోయింది.
‘ప్రకటనల పరమార్థం!’ కథనంలో చెప్పినట్టు పత్రికలకు ప్రకటనలు ఇస్తారే తప్ప కరపత్రాలకు కాదు కదా? ఆంధ్రజ్యోతికి పత్రికా లక్షణాలున్నాయా? ఆ పత్రికలోని రాతలు జర్నలిజం విలువలు కోల్పోయి చాలా కాలమైంది. తమది పత్రికనే భ్రమలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఉందే తప్ప…ప్రజలు, పాఠకులు అలా భావించడం లేదు. ఒకప్పుడు పత్రికలకు ప్రత్యామ్నాయంగా తమ వాయిస్‌ను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రజాసంఘాలు కరపత్రాలను వేసేవి.
నేడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమాచార వ్యవస్థ రూపు రేఖలే మారాయి. మెయిన్‌స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తోంది. ఇంకా తమ పెత్తనమే సాగాలని పత్రికా యజమానులు కోరుకోవడం అత్యాశే అవుతుంది. జగన్ సర్కార్ సంక్షేమ పథకాల గురించి పత్రికలు రాయక ముందే సోషల్ మీడియా ప్రజల చెంతకు శరవేగంతో తీసుకుపోతోంది. కావున ఆంధ్రజ్యోతిలో ప్రకటనలు చదువుకుని తమ కోసం ఏ పథకాలున్నాయో తెలుసుకునే దుస్థితిలో ప్రజలు లేరు. అయినా ఉద్యోగులను రోడ్డున పడేసి, ఉన్న వాళ్ల వేతనాల్లో భారీ కోతలు విధించిన ఆంధ్రజ్యోతి యాజమాన్య కడుపు నింపడానికి ప్రకటనలు ఇవ్వాలా?
-సొదుం