జగన్ ప్రభుత్వం ఇంతకాలానికి తనకు పనికొచ్చే నియామకాన్ని చేపట్టింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు.
ఆర్థిక వ్యవహారాల్లో అద్భుతమైన అవగాహన, అనుభవం కలిగిన రజనీష్ పలు బోర్డులకు డైరెక్టర్‌గా వ్యవహరించినట్టు స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం గమనార్హం. రజనీష్ కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంత కాలానికి ప్రభుత్వం తనకు అత్యవసరంగా కావాల్సిన సలహాలేంటో గుర్తించినట్టు… ఈ నియామకమే చెబుతోంది. అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన నియామకాలను గమనిస్తే… ముఖ్యమంత్రి జగన్ తనకు సన్నిహితులైన వాళ్లకు ఏదో ఒక పదవి కట్టబెట్టేందుకు అన్నట్టుగా సలహాదారుల పోస్టులను పెద్ద సంఖ్యలో క్రియేట్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.
జగన్ ముఖ్యమంత్రిగా పాలన సాగించిన మొదటి 13 నెలల కాలంలో 33 మంది సలహాదారులను నియమించుకున్నారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారుల్లో ….అజయ్‌కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి, కె.రామచంద్రమూర్తి, జుల్ఫీ రావ్జీ, సాగి దుర్గాప్రసా దరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హసన్, ఎం.శామ్మూల్ ఉన్నారు. వీరిలో రామచంద్ర మూర్తి తన పదవికి రాజీనామా చేసి మధ్యలోనే వెళ్లిపోయారు.
దేవులపల్లి అమర్ పదవీ కాలాన్ని రెండు రోజుల క్రితం పొడిగించారు. కేబినెట్ హోదా కాకుండా సలహాదారుల పదవుల్లో మరికొందరు ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరూ ఆర్థిక సలహాదారులు లేకపోవడం జగన్ ప్రభుత్వ ప్రత్యేకత. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందన్న విమర్శలు, పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలు కూడా ఇవ్వలేదని దయనీయ స్థితి తలెత్తిందనే ప్రతిపక్షాల విమర్శలతో జగన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు జగన్ ప్రభుత్వాన్ని ఆర్థిక క్రమశిక్షణలో నడిపేవారే లేరా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సలహాదారును నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు.
రజనీష్‌కుమార్ నియామకం ప్రభుత్వానికి ఉపయోగపడితే …ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులొచ్చినట్టే.