ఇటీవలే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇదే మాట చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము కేంద్రం గైడ్ లైన్స్ నే అనుసరిస్తున్నామని, ఈ విషయంలో ఏమైనా బీజేపీ నేతలకు అభ్యంతరం ఉంటే.. వారు కేంద్రంతో కొట్లాడాలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో దేవాలయాల మూత విషయంలో పవార్ ఇలా స్పందించారు. మహారాష్ట్రలో ప్రముఖ ఆలయాలను ఆంక్షల మధ్యన తెరుస్తుండటాన్ని అక్కడి బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఆలయాలను పూర్తిగా తెరవాలంటూ వారు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ స్పందిస్తూ.. ఆలయాల మూత తమకేమీ ఆనందం కాదని, కరోనా పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఆంక్షలను పెట్టినట్టుగా, అవి కూడా పూర్తిగా కేంద్రం సూచనల ప్రకారమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో కొట్లాడుకోవాలని ఆయన బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.
అచ్చంగా ఏపీ వ్యవహారం కూడా ఇలానే ఉంది. వినాయకచవితి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. వినాయక ఉత్సవాలను ఎవరికి వారు ఇళ్లలో ఉండి నిర్వహించుకోవాల్సి ఉంటుందని, మండపాలకు అనుమతులు ఉండవని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ పండగలపై ఎందుకీ కక్ష అంటూ బీజేపీనేతలు ప్రశ్నించేశారు.
ప్రభుత్వం ప్రకటనతో సంబంధం లేకుండా.. ప్రజలు కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితిని నిర్వహించుకోవాలని బీజేపీ నేత సోమూ వీర్రాజు ప్రకటించేశారు. మరి ప్రభుత్వ ప్రకటనను పట్టించుకోవద్దని చెబుతున్నప్పుడు, ఈ బీజేపీ నేత మళ్లీ ఎందుకు కోవిడ్ ప్రస్తావన తీసుకొస్తున్నారో!
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనే ప్రస్తావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మల్లాది విష్ణు స్పందిస్తూ… పండగలూ, మత పరమైన కార్యక్రమాలతో ప్రజలు గుమికూడకుండా చూడాలంటూ కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిన విషయాన్ని మల్లాది ప్రస్తావించారు. ఈ విషయమై ఏదైనా మాట్లాడుకునేది ఉంటే కేంద్రంతో మాట్లాడుకోవాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు.
ఒకవైపు ప్రధానేమో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటారు. కోవిడ్ వెళ్లిపోయిందని అనుకోవద్దని హెచ్చరిస్తారు. ఇంకోవైపు బీజేపీ నేతలేమో.. అంతా మామూలుగా ఉండాలని అంటారు. లేదంటే హిందువులపై వివక్ష అంటారు. అవతల కేరళలో ఇలానే బక్రీద్ కూ, ఆ తర్వాత ఓనంకూ అన్ని ఆంక్షలనూ మినహాయించారు. ప్రస్తుతం దేశంలోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలుస్తోంది. చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాలన్నట్టుగా ఉంది బీజేపీ నేతల తీరు.