మిగిలింది రమారమీ 90 ఓవర్లు. ఇంగ్లండ్ చేయాల్సింది 291 పరుగులు. అదే ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి. ఓవల్ టెస్ట్ చివరి రోజుకు ఈ సమీకరణం ఏర్పడింది. తొలి రోజే 13 వికెట్లు పడిన పిచ్ పై టెస్టు మ్యాచ్ ఐదో రోజు వరకూ రావడం విశేషమే. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ టెస్టు మ్యాచ్ పెద్ద మలుపు తిరిగింది.
ప్రస్తుతం చూస్తే.. ఈ మ్యాచ్ ఇప్పుడు ఎవరి చేతిలోనూ లేదు. ఫ్లాట్ గా మారిపోయిన పిచ్ పై ఒకే రోజు పది వికెట్లు తీయడం తేలికేమీ కాదు భారత బౌలర్లకు. అదే సమయంలో 90 ఓవర్ల ఆటలో 291 పరుగులను చేజ్ చేయడానికి ఇంగ్లండ్ కు తేలికేమీ కాదు. ఓవర్ కు మూడు పరుగులకు పైనే చేయాలనే టార్గెట్ ను పెట్టుకుంటే.. ఇంగ్లండ్ కు మొదటికే మోసం రావొచ్చు కూడా!
ఇంతకీ ఈ స్టేడియం గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే.. ఐదో రోజు విపరీతంగా బౌలర్లకు అనుకూలంగా ఉండదని స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి గత రికార్డులు. నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఏ జట్టు అయినా ఆలౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జట్లు ఆరేడు వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
దీంతో.. డ్రా కోసమే ఆడితే ఇంగ్లండ్ దాన్ని సాధించగలదేమో అనిపించేలా ఉంది గత చరిత్ర. అయితే ఈ మైదానంలో భారీ స్కోర్లను చేజ్ చేసి విజయం సాధించిన దాఖాలాలు లేవు. కనీసం మూడొందల పరుగుల స్థాయి టార్గెట్ ను కూడా ఏ జట్టు కూడా చేజ్ చేసి విజయం సాధించలేకపోయింది. మామూలుగానే ఏదైనా టెస్టు మ్యాచ్ లో 300 పరుగులకు మించిన లక్ష్యాన్ని చేజ్ చేసి విజయం సాధించడం అరుదైన సంగతే. ఇప్పుడు ఇంగ్లండ్ కు అలాంటి అరుదైన ఫీట్ ను సాధించడం ఈజీ ఏమీ కాదు.
ఇక అనూహ్యంగా భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన ఏదైనా చేసే అవకాశాలూ లేకపోలేదు. ఐదో రోజుకు పిచ్ అనూహ్య మలుపులు తిరగవచ్చని కామెంటరేటర్లు గట్టిగా చెప్పడం లేదు కానీ, ఛాన్సెస్ ఉంటాయంటున్నారు. నాలుగో రోజు చివరి సెషన్లో ఇంగ్లండ్ ఓపెనర్లు సులువుగానే బ్యాటింగ్ చేశారు. మరి రాత్రికి రాత్రి పిచ్ తీరులో మార్పు చోటు చేసుకుంటుందా.. ఈ మ్యాచ్ భారత్ విజయంతో ముగుస్తుందా?