ఒకప్పుడు ఇండియాలో పెళ్లి వయసు అంటే 18 యేళ్లు. గత జనరేషన్లలో అబ్బాయికి కూడా 18 యేళ్లకు పెళ్లిన చేసిన వారి సంఖ్య ఎంతో ఉంటుంది. వ్యవసాయమే జీవనాధారం అయిన రోజుల్లో, వ్యవసాయధార కుటుంబాల్లో 30 యేళ్ల కిందటి వరకూ ఈ పద్ధతే ఉండేది. అబ్బాయికి 20 వచ్చాయంటే పెళ్లి చేసేసే వారు. పెళ్లితో ఒక మెచ్యూరిటీ వస్తుందనేది అప్పటి అభిప్రాయం. అలాగే చదువులు, ఉద్యోగం సంపాదించుకోవడం వంటి.. టార్గెట్లు లేవు.
అలాంటివి మొదలయ్యాకే అబ్బాయికి పెళ్లి వయసు పెరుగుతూ వస్తోంది. అలాగే అమ్మాయిలకు కూడా పెళ్లి వయసు గతంలో కన్నా చాలా వరకూ పెరిగింది. అమ్మాయిలు కూడా డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు సంపాదించి, ఒకటి రెండేళ్లు ఉద్యోగాలు చేసిన తర్వాతే పెళ్లి అని అనే రోజులు ఇవి. అలా అనుకంటే వింతగా మారింది. అమ్మాయిల్లో కూడా కొందరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా పెళ్లికి తొందరేమంటున్నారు. అమ్మాయిల్లో కూడా సగటు పెళ్లి వయసు 25 యేళ్లు దాటింది. వీరిలో కొందరు 30కి దగ్గరపడుతున్నా.. చూద్దాంలే అంటున్నారు!
ఇక అబ్బాయిల్లో 25లోపు పెళ్లి చేసుకునే వారెవరూ కనిపించరు. 27 కు పెళ్లి అంటున్నా.. కూడా చిన్న వయసులోనే! అనే పరిస్థితి వచ్చేసింది. 30 దాటితే అప్పుడు పెళ్లి విషయంలో కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇదీ సామాజిక పరిస్థితి. మరి పెళ్లికి తగిన వయసు 30దాటిన తర్వాతే అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా 30 యేళ్ల వయసు దగ్గరకు పడే సరికి.. చాలా మారతారు అని, అప్పుడే వారికి పెళ్లి పట్ల కచ్చితమైన దృక్ఫథం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ముప్పై వచ్చే సమయానికి పెళ్లికి కావాల్సిన, ఇంకో వ్యక్తితో కలిసి జీవించదగిన మెచ్యూరిటీ వస్తుందని చెబుతున్నారు. పెళ్లికి కావాల్సిన వాటిల్లో కీలకమైనది మెచ్యూరిటీనే అని, అది రావాలంటే ముప్పై వరకూ ప్రపంచాన్ని చూస్తూ సాగడమే అని అంటున్నారు.
ముప్పై యేళ్ల వయసు వచ్చే సరికి.. జీవితం పట్ల ఒక దృక్పథం ఏర్పడుతుంది, అనుభవపాఠాలు రిలేషన్ షిప్ గురించి అర్థం అయ్యేలా చేస్తాయి, పెళ్లి అంటే సెక్స్ మాత్రమే కాదని తెలుస్తుంది, అందం -వ్యక్తిత్వాల్లోని లోతులు అర్థం అవుతాయి, అప్పటి వరకూ సింగిల్ గా ఉండటం వల్ల స్నేహితులతో వీలైనంత సమయం గడిపే అవకాశం లభిస్తుంది, ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది
బోలెడంత ట్రావెల్ చేయడానికి కూడా ఆ సమయం సరిపోతుంది.. సింగిల్ గా లేదా స్నేహితులతో ఆస్వాధించాల్సిన వినోదాలన్నీ అప్పటికి పూర్తవుతాయి… ముప్పై తర్వాత వైవాహిక అడుగులు వేస్తే ఇంకా ఏదో మిస్ అయ్యామనే భావన చాలా వరకూ ఉండదని నిపుణులు అంటున్నారు.
ముప్పై లోపే పెళ్లి చేసేసుకుంటే.. చాలా మంది స్నేహితులు అప్పటికి ఇంకా బ్యాచిలర్స్ గా కనిపిస్తూ ఉంటారు. పెళ్లి గురించి చాలా కలర్ ఫుల్ డ్రీమ్స్ ఉండి ఉంటాయి. అవి అనుభవంలోకి వచ్చాకా చాలా సాదాగా అనిపించవచ్చు. అప్పుడది ఒక అసంధిగ్ధావస్థ అవుతుంది.
తొందరగా కమిట్ అయ్యామేమో అనే భావనా కలగొచ్చు. అదే ముప్పై వయసు మీద పడితే.. ఆటిట్యూడే చాలా వరకూ మారిపోతుంది. ఇక పెళ్లి చేసుకోవాల్సిందే అనే థాట్ బలంగా మారొచ్చు. అంతే కాదు.. కొందరికి ఇక పెళ్లైతే చాలురాబాబూ అనిపించొచ్చు. ఆ దశలో జత కలిసే పార్ట్ నర్ పట్ల ప్రేమాప్యాయతలు గాఢంగా ఉంటాయి.
ఏతావాతా ముప్పై యేళ్ల వరకూ సింగిల్ గా ఉండమని, బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేస్తూ, ఆ జీవితాన్ని అస్వాధించి, ముప్పై దాటిన తర్వాత వైవాహిక జీవితంలోకి లాంఛనంగా అడుగుపెట్టాలనేది వీరి సలహా.