ఏపీ ప్రభుత్వం ఇటీవల లీకులతో ఇబ్బంది పడుతోంది. విధాన నిర్ణయాలు, గణాంకాలు అన్నీ బయటకు పొక్కుతున్నాయి. వాటి ఆధారంగా ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. అప్పులు, తిప్పలు అంటూ వాయించేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిపై కోర్టు కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ దశలో ఇలాంటి లీక్ లకు చెక్ పెట్టాలనుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. ఇటీవల ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం, తాజాగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఆమధ్య పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సాక్ష్యాధారాలతో సహా ఏపీ అప్పులపై ఉపోద్ఘాతమిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలంటూ వాటిని కొట్టేశారు కానీ, లాజికల్ గా సమాధానం చెప్పలేకపోయారు ఆర్థిక మంత్రి బుగ్గన. ఆ తర్వాత బీజేపీ ఆ విషయాన్ని హైజాక్ చేసింది. ఏపీ అప్పుల కుప్ప అంటూ రెచ్చిపోయింది. అప్పులు చేయడం మీకు పద్ధతికాదంటూ సుద్దులు చెప్పింది. అసలు కేంద్రం చేసిన అప్పుల లెక్కలు తీయండి అంటూ వైసీపీ ప్రశ్నించే సరికి సైలెంట్ అయింది.
ఈ క్రమంలో అసలు ఆర్థిక విషయాలు ఎందుకు బయటకు పొక్కుతున్నాయని ఆరా తీసింది ప్రభుత్వం. లీకు వీరులు ఉన్నా కూడా, అధికారులతో జరిగే చర్చలు, సమీక్షల్లో ఇలాంటి వ్యవహారాలు బహిర్గతం అవుతున్నాయని తేలిపోయింది. దీంతో సమీక్ష సమావేశాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
సీఎం జగన్ ఆధ్వర్యంలో జరికే శాఖాపరమైన సమీక్షల్లో ఆర్థిక అంశాల ప్రస్తావ లేకుండా జాగ్రత్తపడాలని అధికారులకు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలిచ్చారట. పెండింగ్ బిల్లులు, ఇతర వ్యవరాహాలపై విడిగా ముఖ్యమంత్రిని కలసి వివరించాలని, లేదా సీఎం పేషీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలని చెప్పారట. అంతే కాదు. సమీక్షల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు వాడొద్దని, అవసరమనుకుంటే ప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించారట.
పారదర్శక పాలన ముఖ్యమే కానీ..
ప్రభుత్వం వద్ద రహస్యాలేవీ ఉండాల్సిన అవసరం లేదు, పాలన పారదర్శకంగానే సాగాలి. కానీ ప్రతిపక్షాల చేతికి అన్ని అంశాలు వెళ్తే, కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే. అనవసర రాద్ధాంతం, వాటికి ప్రభుత్వ వివరణ తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే ప్రభుత్వం భయపడుతోంది, లేనిపోని తలనొప్పులు ఎందుకని ఫీలవుతోంది.
అప్పులు చేసి సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నా.. అనవసరంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకూడదని నిర్ణయించింది. అందుకే లీకు వీరులకు చెక్ పెట్టేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. అయితే ఎంత గుప్పెట దాయాలనుకున్నా ఇలాంటి విషయాలు బయటకు పొక్కక తప్పదు. మరి ఇప్పుడేం జరుగుతుందో వేచి చూడాలి.