తెలుగు కాషాయం… ?

కాషాయం పార్టీ అంటే అందరికీ తెలిసిందే. బీజేపీ సిద్ధాంత బద్ధత మీద కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. బీజేపీ తాను అనుకున్నట్లుగానే అన్నీ చేస్తుంది. ఆ రకంగా గట్టి సంకల్పంతో కూడా ఆ…

కాషాయం పార్టీ అంటే అందరికీ తెలిసిందే. బీజేపీ సిద్ధాంత బద్ధత మీద కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. బీజేపీ తాను అనుకున్నట్లుగానే అన్నీ చేస్తుంది. ఆ రకంగా గట్టి సంకల్పంతో కూడా ఆ పార్టీ ముందుకు పోతుంది.

ఇదిలా ఉంచితే ఈ మధ్య కాలంలో వైసీపీ సర్కార్ మీద బాణాలను బాగా ఎక్కుపెడుతున్న బీజేపీకి సడెన్ గా తెలుగు భాష మీద ప్రేమ పుట్టుకువచ్చింది అంటున్నారు. బీజేపీ ఇపుడు అర్జంటుగా తెలుగు వారోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.

ఈ నెల 29న తెలుగు భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. ఆ రోజు నుంచి వారం పాటు ఏపీవ్యాప్తంగా తెలుగు ఆవశ్యకత గురించి చాటి చెబుతూ కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ చెబుతున్నారు. 

తెలుగు భాషకు విశేష కృషి చేసిన గిడుగు జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోవడం దారుణమని కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని ఎలా మిక్స్ చేస్తారని కూడా నిలదీస్తున్నారు. నిజానికి సంస్కృతం నుంచే తెలుగు పుట్టింది. ఈ రెండూ ఇంకా బాగా వృద్ధి చెందుతాయనే ఈ విలీనమని తెలుగు అకాడమి ప్రెసిడెంట్ లక్ష్మీ పార్వతి ఓ వైపు చెబుతున్నారు.

కానీ తెలుగు భాషకు వైసీపీ తీరని అన్యాయమే చేస్తోందని బీజేపీ చిందులు తొక్కుతోంది. మొత్తానికి తెలుగు అంటే వల్లమాలిన ప్రేమను చూపిస్తూ కాషాయ దళం ఇపుడు రంగంలోకి దూకుతోంది. ఇవన్నీ సరే కానీ ఈ తెలుగు అభిమానం భాష వరకే ప‌రిమితమా లేక తెలుగుదేశం పార్టీ దాకా కూడా పాకుతుందా అన్నదే రాజకీయ వర్గాలలో వేడి వాడి చర్చ.