మొన్నటికిమొన్న గానకోకిల లతా మంగేష్కర్ ను కోల్పోయింది ఇండియా. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టైమ్ లో మరో ఊహించని ఘనట. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహరి ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బప్పిలహరి కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 69.
కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బప్పిలహరి. దాదాపు నెల రోజులు హాస్పిటల్ లో ఉండి సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికొచ్చిన 24 గంటల్లోనే ఆయన మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. ఈసారి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.
బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్ ను పరిచయం చేసిన వ్యక్తి బప్పిలహరి. అప్పటివరకు సంప్రదాయబద్ధంగా సాగిన సంగీతానికి ఓ కొత్త ఊపునిచ్చారు. 80, 90వ దశకాల్లో తన సంగీతంతో, గానంతో ఇండియాను ఓ ఊపు ఊపారు. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. డిస్కో డాన్సర్, వర్దత్, నమక్ హలాల్, షరాబీ, డాన్స్ డాన్స్, కమాండో లాంటి ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు.
బెంగాల్ లోని సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన బప్పిలహరి.. 90ల్లో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆయన స్టేజ్ ప్రదర్శనలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. సింగర్ గా, కంపోజర్ గా ఇండియన్ మ్యూజిక్ లో తనదైన ముద్ర వేశారు బప్పి.
హిందీ, బెంగాలీ సినిమాలతో పాటు.. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో పలు సినిమాలకు వర్క్ చేశారు బప్పిలహరి. తెలుగులో ఆయన సింహాసనం సినిమా నుంచి వర్క్ చేశారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీగారి పెళ్లాం, రౌడీ ఇన్ స్పెక్టర్.. ఇలా ఎన్నో సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించారు. ఓవైపు కుర్రకారును ఓ ఊపు ఊపేసిన డిస్కో మ్యూజిక్ తో పాటు మరోవైపు అందమైన మెలొడీలు అందించడం బప్పిలహరికే సాధ్యం.