పెట్టుబడుల ఉపసంహరణ.. ప్రైవేటీ కరణ, వాటాల అమ్మకం..ఏదైతేనేం, మినిమం మూడేళ్ల పదవీ కాలాన్ని మిగిలి ఉన్న మోడీ ఈ టర్మ్ పూర్తయ్యే సరికి.. ఈ ఎత్తుగడలతోనే ముందుకు వెళ్తూ కేంద్ర ప్రభుత్వానిది అంటూ చెప్పుకోవడానికి అయినా ఏమైనా మిగులుస్తారా? అనేది సందేహంగా మారింది.
మొన్నటి బడ్జెట్ లో పలు వ్యవస్థల అమ్మకానికి ప్రణాళిక రచించింది మోడీ ప్రభుత్వం. ఈ జాబితాలో ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు కొంత సెంటిమెంట్ మిగిలే ఉంది కాబట్టి.. ఈ విషయంలో కాస్తైనా నిరసన స్వరం వినిపిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వానికి మాత్రం అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు.
ఈ ప్రైవేటైజేషన్ గురించి కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ.. 'వీలైతే అమ్మకం లేకపోతే మూతే..' అని తేల్చేశారు! ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న ఈ వ్యవస్థలను అమ్మడం ఖాయమని, ఒకవేళ అమ్మలేని పరిస్థితులు వస్తే వాటిని మూత వేయడానికి కూడా తమకేమాత్రం మొహమాటం లేదని కేంద్ర మంత్రి ఒకరు స్పష్టంగా చెప్పారు. ఇదీ మోడీ ప్రభుత్వ విజన్!
ఇక బ్యాంకుల ప్రైవేటైజేషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. నిరార్ధక ఆస్తుల సాకుతో.. పలు బ్యాంకులను ప్రైవేట్ కు అప్పగించేసే ఉద్దేశం ఉందట కేంద్ర ప్రభుత్వానికి. ఈ జాబితాలో ముందుగా.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాల విక్రయానికి కేంద్రం రెడీ అయ్యింది. కొత్త ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా.. మినిమం రెండు బ్యాంకులను అమ్మేయాలని టార్గెట్ గా పెట్టుకుందట కేంద్రం.
అంత కన్నా సంచలనం ఏమిటంటే.. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు వాటాలను కూడా అమ్మేసే ఉద్దేశంతోనే ఉందట కేంద్ర ప్రభుత్వం. చిన్న చిన్న బ్యాంకులను, బలహీనంగా ఉన్న బ్యాంకులను కొనడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి.. లాభాల్లో ఉన్న, భారీ వ్యవస్థలు అయిన బ్యాంకులనే అమ్మకానికి పెడితే.. వచ్చే వాళ్లు ఉత్సాహంగా వస్తారనే లెక్కలతో కేంద్రం ఉందనే వార్తలు సామాన్యుడిని విస్మయానికి గురి చేస్తాయి.
అయితే.. కేంద్ర ప్రభుత్వం కేవలం బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే కాస్త భయపడుతున్నట్టుగా ఉంది. ప్రైవేటీకరణ అంటే.. ఉద్యోగులు సమ్మెలు, ధర్నాలు అంటారని భయమేమో. అయినా.. మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఎవరికైనా, ఎవరి ధర్నాలకు అయినా.. నిరసనలకు అయినా భయపడాల్సిన అవసరం ఉందా? ఏడెనిమిది నెలలుగా రెండు రాష్ట్రాల రైతులు గగ్గోలు పెడుతుంటేనే.. వీసవెత్తు చలనం లేదు.
అలాంటిది బ్యాంకుల్లో పని చేసే వాళ్ల నిరసనలకు భయపడుతుందా! తను చేయాలనుకున్నది చేయాలని చేస్తుంది మోడీ ప్రభుత్వం. దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తెలిశాకా.. ఇక ఆడిందే ఆట, పాడిందే పాట!
అయితే ఎటొచ్చీ.. ఈ రేంజ్ లో పాత వ్యవస్థల వాటాల అమ్మకాలు, ప్రభుత్వానికి అంటూ కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసేంత సీన్ లేదు. ఇలా అయితే.. 2024 నాటికి అమ్మడానికి అయినా ఇంకేమైనా మిగిలి ఉంటుందా? అనేదే ప్రశ్న!