సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద నెపం. ఆ తర్వాత మాత్రం ఈవీఎంల మీద మాట్లాడటం లేదు. అలా మాట్లాడితే మోడీ ఏం చేస్తాడో అని భయం!
ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి గెలిచిందంటూ వక్రభాష్యం. మొదటేమో ఈవీఎంలు అన్నారు, ఆ తర్వాత గాలికి అన్నారు. కానీ ఆ గాలికి తాము ఎక్కడకు కొట్టుకుపోయిన విషయాన్ని మాత్రం ప్రస్తావించుకునే ధైర్యం చేయడం లేదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
అయితే తెలుగుదేశం పార్టీ కూకటివేళ్లతో పెకలించబడిన దృశ్యం పల్లెల ఎన్నికలు చాటుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనో, అసెంబ్లీ ఎన్నికల్లోనో ఓడితే అది అప్పటి వరకే. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి ఆ పార్టీ పుంజుకోవడానికి కొంత అవకాశం ఉండనే ఉంటుంది.
1999 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తన ఉనికిని కోల్పోలేదు. అప్పటికే టీడీపీ వరసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన పచ్చమీడియా ఒక రేంజ్ లో మోస్తోంది.
ఆయనను అంతర్జాతీయ నేతగా చిత్రీకరించే పని అప్పట్లో బీభత్సంగా జరుగుతూ ఉండేది. అలాంటి సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన మూలాల్లో బలంగా కనిపించింది. ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్ నాడు తన ఉనికిని చాటుకుంది. అలా మూలాల్లో బలంగా ఉండిన ఉనికే 2004 నాటికి కాంగ్రెస్ ను విజేతగా నిలపగలిగింది.
ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో నెగ్గలేకపోతే మాత్రం.. నిస్సందేహంగా అది దాని పతనావస్థే. పంచాయతీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలానే ఉంది. చంద్రబాబు నాయుడు ఏవేవో సాకులు చెప్పి ఓటమిని తక్కువ చేసే ప్రయత్నం చేయవచ్చు గాక. కానీ పరిస్థితి చేయిదాటిపోయిందని మాత్రం గ్రౌండ్ లెవల్లో స్పష్టం అవుతోంది.
ఇలా మూలుగుతున్న టీడీపీపై మున్సిపల్ ఎన్నికలు పడుతున్నాయి. తమ కంచుకోటల్లో కూడా ఈ ఎన్నికలకు నామినేషన్లను వేయించడానికి గత ఏడాది ముప్పుతిప్పలు పడింది టీడీపీ. కార్యకర్తలను మీటింగుకు అంటూ పిలిచి.. వారి చేత నామినేషన్ల పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్న పరిస్థితి. అలా నామినేషన్లు వేసిన వారు ఇప్పుడు ఏ మేరకు ప్రచారంలో అయినా పాలుపంచుకుంటారు? అనేది ప్రశ్నార్థకమే.
పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పార్టీల గుర్తుల మీద జరగవు కాబట్టి.. తెలుగుదేశం తన లెక్కలేవో తను చెప్పగలిగింది. అయితే మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా పార్టీల గుర్తుల మీదే జరుగుతాయి కదా.. ఇప్పుడు ఎవరి సత్తా ఏమిటో స్పష్టం అవుతోంది. పట్టణాల్లో ఎవరి పట్టేమిటో తేలిపోతుంది.
రాష్ట్రం మొత్తం మీద ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా క్లారిటీ వస్తుంది. ఏ సర్వేలు, ఎవరి అధ్యయనాలూ, ఎవరి వాదనలూ అవసరం లేకుండా.. ఎవరికెంత అనుకూలత ఉందో, ఎవరికి ఎంత ఓట్ల శాతం ఉందో.. ఫుల్ పిక్చర్ క్లారిటీ రానుంది. తెలుగుదేశం పార్టీ తదుపరి రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించబోయేవి స్థానిక ఎన్నికలే. వీటి నిర్వహణ కోసమే ఆ పార్టీ మొన్నటి వరకూ తెగ వగలుబోయిందని వేరే చెప్పనక్కర్లేదు. తీరా ఇప్పుడు మూలుగుతూ ఉంది.