లంచ్ లోపే ముగించేస్తారా?

చెన్నైలో ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజ‌యాన్ని ఖ‌రారు చేసుకుంది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలే ఉన్నా..  మ్యాచ్ భార‌త్ వైపు స్ఫ‌ష్టంగా మొగ్గింది. ఇంగ్లండ్ ముందు కొండంత ల‌క్ష్య‌ముంది.…

చెన్నైలో ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజ‌యాన్ని ఖ‌రారు చేసుకుంది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలే ఉన్నా..  మ్యాచ్ భార‌త్ వైపు స్ఫ‌ష్టంగా మొగ్గింది. ఇంగ్లండ్ ముందు కొండంత ల‌క్ష్య‌ముంది. అయితే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయ‌డానికి బ్రిటీష్ బ్యాట్స్ మెన్ అప‌సోపాలు ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఇది టెస్టుకు ప‌నికి వ‌చ్చే పిచ్ కాదంటూ బ్రిటీష్ విశ్లేష‌కులు మొత్తుకుంటున్నారు. త‌మ‌కు ఓట‌మి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పిచ్ మీద నెపం వేయ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్ అనే ప్ర‌శ్న‌కు మాత్రం వారు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

అశ్విన్ లాంటి టెయిలెండ‌ర్ ధాటిగా ఆడి సెంచ‌రీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ ఏకంగా 161 ప‌రుగులు చేశాడు. పిచ్ మీద బూత‌మేదీ కూర్చోలేద‌ని విరాట్ కొహ్లీ కూడా నిరూపించాడు. అయితే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు మాత్రం ఈ పిచ్ ను చూసి వ‌ణికిపోతున్న‌ట్టుగా ఉన్నారు. ప‌క్క పిచ్ మీద మొద‌టి మ్యాచ్ లో విజ‌యం సాధించిన జ‌ట్టు.. పిచ్ మారే స‌రికి బిక్క‌మొహం వేస్తోంది.

ఇంగ్లండ్ ముందు 429 ప‌రుగుల ల‌క్ష్య‌ముంది. 53 ప‌రుగుల‌కు మూడు వికెట్ల‌ను కోల్పోయింది. రూట్ క్రీజ్ లోనే ఉన్నాడు. అయితే.. ఎవ‌రెంత‌సేపు బ్యాటింగ్ చేయ‌గ‌ల‌రు? అనేదే ప్ర‌శ్న‌. నాలుగో రోజు లంచ్ విరామానికే మ్యాచ్ పూర్తి కావొచ్చు అనే విశ్లేష‌ణ‌లే వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో విజ‌యానికి భార‌త జ‌ట్టు ఏడు వికెట్ల దూరంలో ఉంది. పిచ్ నుంచి స్పిన్న‌ర్ల‌కు ల‌భిస్తున్న సహ‌కారాన్ని బ‌ట్టి చూస్తే..  లంచ్ కే మ్యాచ్ అయిపోవ‌చ్చు. లేదంటే మ‌రో గంట సేపు మ్యాచ్ కొన‌సాగ‌వ‌చ్చ‌ని ఎన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల‌ను సాధించి, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో అద్భుత శ‌త‌కాన్ని సాధించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా ఐదు వికెట్ల స్పెల్ ను వేయ‌గ‌లిగితే.. ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ఒకే మ్యాచ్ లో ప‌ది వికెట్లు తీసి, సెంచ‌రీ కూడా చేసిన అరుదైన ఆల్ రౌండ‌ర్ల‌లో ఒక‌రిగా నిలిచే అవ‌కాశం అశ్విన్ ముందుంది. సెకెండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ లో మ‌రో నాలుగు వికెట్లు తీస్తే..  ఆ జాబితాలో నిలుస్తాడు అశ్విన్.

ఇప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి?