ఎందుకుండదు.. కచ్చితంగా లింక్ ఉంటుంది. కాయకష్టం చేసే వాళ్లు చీకటి పడగానే కాస్త పుచ్చుకుంటారు. లేదంటే ఒళ్లు నొప్పులతో వాళ్లకు రాత్రిళ్లు నిద్రపట్టదు. ఇప్పుడిదే విషయాన్ని లండన్ లోని లివర్ పూల్ యూనివర్సిటి శాస్త్రీయంగా నిరూపించింది. వీళ్లు ఈ సర్వే చేయడానికి ఓ కారణం ఉంది.
ఏ ఏ రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్న చేసింది ఈ యూనివర్సిటీ. దీని వల్ల ఆ వృత్తులకు సంబంధించిన వ్యక్తుల్లో అతిగా మద్యం తాగే వ్యక్తులకు చికిత్స అందించడం ఈజీ అవుతుందని చెబుతోంది.
అందుకే లండన్ లో 100817 మందిని సర్వే చేసింది యూనివర్సిటీ. వీళ్లందరి సగటు వయసు 55 సంవత్సరాలు. వృత్తిపరంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, చేసే పని ఆధారంగా వీళ్లు అతిగా మద్యం సేవిస్తున్నట్టు సర్వేలో గుర్తించారు. ఇలా అతిగా మద్యం సేవించేవాళ్లలో… నిర్మాణరంగం, పరిశ్రమలో పారిశుద్ధ రంగంలో పనిచేసే నిపుణులు ఎక్కువగా ఉన్నారు. ఇక అతిగా మద్యం సేవించనివాళ్లలో ఉపాధ్యాయులు, వైద్యులు, శాస్త్రవేత్తలు ఉన్నారు.
బ్రిటిన్ లో గడిచిన పదేళ్లలో అతిగా మద్యం సేవించే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీళ్లను సరైన దారిలో పెట్టేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ చెబుతోంది. ఈ విషయంలో మహిళలు, పురుషుల మధ్య తేడాల్ని కూడా ఈ సర్వే గుర్తించింది. పురుషులతో పోలిస్తే, అతిగా మద్యం సేవించే మహిళల సంఖ్య తక్కువగా ఉందని.. అయినప్పటికీ ఓవరాల్ గా చూస్తే అతిగా మద్యం సేవించే వాళ్ల సంఖ్య కూడా పెరిగిందని అధ్యయనంలో తేలింది.
దేశాలతో సంబంధం లేకుండా ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడతాయని.. చేసే పనికి, మద్యం తాగే మోతాదుకు కచ్చితంగా సంబంధం ఉందని యూనివర్సిటీ తెలిపింది.