'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మరు..' అని తేల్చారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇంకా నెలన్నరే అవుతూ ఉంది. ప్రజలు ఎవరి మాటలను నమ్మారో ఆ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? ఎలాంటి కబుర్లు చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమన్నారు? తన గురించి ఏం చెప్పుకున్నారో అందరికీ తెలిసిందే.
అదే ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుపై మాటల యుద్ధం చేసింది. చంద్రబాబు ఐదేళ్లపాలన గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వెర్షన్ చెప్పింది. అలాంటి మాటల యుద్ధం అనంతరం వచ్చిన ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజేతగా నిలవగా, తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యి కుదేలయ్యింది.
ఇదంతా జరిగి నెలన్నర కావొస్తోంది. చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రజలకు భ్రమలను కల్పించాలని చూసినా, ఆయన తరఫున మెజారిటీ మీడియా ఎంతగా హడావుడి చేసినా.. చివరకు ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలింపజేశాయి.
అయితే ఇంతలోనే చంద్రబాబు నాయుడు మళ్లీ పాతమాటలే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తన మాటలనే నమ్ముతారని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉన్నారు. విత్తనాల కొరత అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదనను ప్రజలు నమ్మరని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు!
ఇలా చెప్పుకోవడంలోనే చంద్రబాబుకు ఆనందం ఉండొచ్చు. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదలనను ప్రజలు విశ్వసించరని చంద్రబాబు తేల్చారు. ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విత్తనాల కొనుగోలు అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి తన బాధ్యత కాదని.. ఇప్పటికప్పుడు విత్తనాలను తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు పంచలేదని.. చంద్రబాబు చెబుతున్నారు.
విత్తన సేకరణ సాధారణంగా జనవరి-ఫిబ్రవరిల్లో జరిగే పని. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడే. అయితే ఆ పనిలో పూర్తిగా విఫలం అయ్యి, ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాళ్లేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నందుకు తననే ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నాయుడు వాదిస్తూ ఉండటం పై ఆయన ఇంకా భ్రమల నుంచి బయటకు వచ్చినట్టుగా లేరని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.