టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా పట్టుదలగా ఉన్నారు. పట్టుదల అనడంకంటే కసి, ప్రతీకారం, వెంజెన్స్ అంటే కరెక్టుగా ఉంటుంది.
ఆయన ఏ విషయంలో కసిగా ఉన్నారు? ఏ విషయంలో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు ? తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బాబు చాలా కసిగా ఉన్నారు. ఆ లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని కసిగా ఉన్నారు.
ఆయన ఆశిస్తున్నట్లు తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే ఆయన భూమ్మీద నిలిచేలా కనబడటంలేదు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీని ఓడించి, జగన్ కు బుద్ధి చెప్పి దేశానికి సందేశం ఇవ్వాలంటున్నారు.
సందేశం ఇవ్వాలనే పెద్ద మాట సాధారణ ఎన్నికల సమయంలో వాడితే బాగుంటుందేమో. సపోజ్ …తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోయింది అనుకుందాం. జగన్ ప్రభుత్వం పడిపోతుందా? ఆయన రాజకీయ జీవితం కకావిలవుతుందా ? తిరుపతిలో టీడీపీ గెలిస్తే దాని వైభవం మళ్ళీ వెలిగిపోతుందా ?
తిరుపతి ఉప ఎన్నిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.వైసిపిని ఓడించడం ద్వారా చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలన్నారు. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఇదే స్ఫూర్తితో జనవరి 21నుంచి 10రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలన్నారు. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని చెప్పారు. వైసిపి వచ్చాక పెరిగిన దాడులు, విధ్వంసాలు, పన్నుల భారాలు, చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. హార్డ్ వేర్ హబ్ గా, మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తిరుపతిని చేశామని., చిత్తూరు జిల్లాలో రూ లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 95వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
తిరుపతి, శ్రీసిటి, కృష్ణపట్నంలను ట్రైసిటీగా అభివృద్ది చేస్తే.., వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని ఆరోపిచారు. వైసిపి వచ్చాక ఒక్క కంపెనీ తేకపోగా ఉన్న అమర రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు రద్దుచేశారాన్నారు. టిడిపి హయాంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాం, అన్నదానం, ప్రాణదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేస్తే.., ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి పవిత్రతకే కళంకం తెచ్చిందని ఆరోపించారు.
టీడీపీ సర్కారు చేసిన మంచిని, వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నిరోధక పనులను ప్రజల బుర్రలోకి ఎక్కించాలని బాబు తాపత్రయ పడుతున్నారు. తాను అధికారంలో ఉండగా చేయలేని కొన్ని వినూత్నమైన పనులను, పథకాలను జగన్ చేస్తుండటంతో బాధపడుతున్న బాబు తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాను ఓడించి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు.
ప్రభుత్వం 0.25% అప్పుల కోసం రైతులు, పేదలపై రూ.70వేల కోట్ల పన్నులు వేసిందని ఆరోపించారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్షా 30వేల కోట్ల అప్పులు చేసి పేదల పథకాల పేరుతో కుంభకోణాలు చేస్తున్నారన్నారు.
ఒక్క ఇళ్ల స్థలాల్లోనే రూ.6,500 కోట్ల కుంభకోణాలు చేశారు. మద్యం, సిమెంటు, ఇసుక రేట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు 10% మాత్రమే ఇచ్చి, 90% వైసిపి నాయకులే స్వాహా చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మాటల్లో బోలెడు కసి చూపిస్తున్న బాబు ఇదే కసి ఉప ఎన్నికలోనూ చూపిస్తారా ?