ఏపీలో శనివారం కొత్తగా నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 62, ఇక అదే రోజున కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 38 అని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ ఎత్తున కరోనా టెస్టింగులు చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకూ మొత్తం టెస్టింగ్స్ విషయం ఏపీ ముందుంది. కరోనా పేషెంట్ లతో టచ్ లో ఉండిన వారికి, అనుమానితులకు టెస్టులు చేస్తూ ఉన్నారు.
ఇక ఇదే సమయంలో బయటపడుతున్న కొత్త కేసులకు సగం స్థాయిలో కరోనా రికవరీ పేషెంట్లు కూడా ఉండటం గమనార్హం. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. 49 నుంచి 69 శాతం మంది కోలుకున్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో మొత్తం 29 కరోనా కేసులు రిజిస్టర్ కాగా, వారిలో కోలుకుని 20 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు.
స్థూలంగా ఇప్పటి వరకూ ఏపీలో 1,525 మంది కరోనా పేషెంట్లను గుర్తించగా, వారిలో 441 మందికి నయం అయ్యింది. వారిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటి వరకూ రికవరీ రేటు 28.91 శాతమని తెలుస్తోంది. 33 మంది కరోనాతో మరణించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో కరోనా మరణాలు ఏవీ చోటు చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో రికవరీ శాతం 26.65గా ఉంది ప్రస్తుతానికి. ఏపీలో ఇంకాస్త మెరుగ్గానే రికవరీ రేటు ఉందని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.