ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో గాంధీభవన్ వేదికగా చెప్పిన పంచాంగం కేంద్రానికి, రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు షాక్ ఇస్తోంది. ఏకంగా ఆయన మరణాన్ని గురించి కూడా చెప్పడం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. వాన రాక, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని పెద్దలు చెబుతారు. అలాంటిది వేద పండితుడు శ్రీనివాసమూర్తి మాత్రం కేంద్రంలో ఓ నాయకుడు మరణిస్తారని ప్రకటించడం గమనార్హం.
కేంద్రానికి దిగ్భ్రాంతి కలిగించే పంచాంగాన్ని కాంగ్రెస్ వేద పండితుడు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సాగిన పంచాంగ పఠనంలో అనేక విషయాలున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవి చూస్తాయని హెచ్చరించారు.
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాల రాస్తోందని విమర్శించారు. అక్టోబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని ఆయన తెలిపారు.
మొత్తానికి కాంగ్రెస్ పంచాంగ పఠనం రాజకీయంగా సాగింది. సహజంగా పంచాంగం చెప్పించుకున్న వాళ్లకు అనుకూలంగా వేదపండితులు భవిష్యత్ గురించి చెప్పడం తెలిసిందే. అయితే గాంధీభవన్ వేదికగా సాగిన పంచాంగం మాత్రం అందుకు విరుద్ధంగా రాజకీయ విమర్శలు చేయడం గమనార్హం. రేవంత్‌రెడ్డిని మెప్పించేందుకు అన్నట్టు పంచాగం చెప్పడం చర్చనీయాంశమైంది.