బాబు కళ్లకు మీడియా గంతలు

మన ముందు ఏం జరుగుతోందో మనకు తెలుస్తుంది. దానితో సమస్యలేదు. తెలుసుకుని సరిచేసుకోవచ్చు. Advertisement కానీ… మన వెనుక ఏం జరుగుతోందో మనకు తెలియాల్సి వుంది. అది కీలకం. కష్టం కూడా. అది తెలిస్తే,…

మన ముందు ఏం జరుగుతోందో మనకు తెలుస్తుంది. దానితో సమస్యలేదు. తెలుసుకుని సరిచేసుకోవచ్చు.

కానీ… మన వెనుక ఏం జరుగుతోందో మనకు తెలియాల్సి వుంది. అది కీలకం. కష్టం కూడా. అది తెలిస్తే, అక్కడ వాస్తవ అవాస్తవాలు బేరీజు వేసుకుని వేసుకోవడం అన్నది ఉత్తముల లక్షణం. కానీ అంతకన్నా ముందు దాన్ని తెలుసుకోవాలి అన్న ఆసక్తి వుండాలి. తెలుసుకుని సరిచేసుకోవాలన్న విచక్షణ వుండాలి. కానీ అసలు అంతకన్నా ముందు తెలియకుండాపోతే.. ఇంక అంతే సంగతులు.

తెలుగునాట అరివీర అనుభవజ్ఞుడు, మోడీ కన్నా తానే సీనియర్, నలభై ఏళ్ల అనుభవం నాది, ఇలా రకరకాల బిరుదులు తనకు తానే ఆపాదించుకుని మురిసిపోయిన తెలుగుదేశాధినేత చంద్రబాబు తన వెనుక ఏం జరుగుతోందో తెలుసుకోవడంలో ఘోరంగా విఫలమయినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, తనవెనుక ఏం జరుగుతోందో తెలియకుండా తన కళ్లకు గంతలు కట్టిన మీడియాను చూసి మురిసిపోయినట్లు కూడా కనిపిస్తోంది.

అవును. నిజమే. రాష్ట్రం సుభిక్షంగా వుందని, రాష్ట్రంలో అంతా సవ్యంగా వుందని, బాబు పాలనలో జనం సుఖ సంతోషాలతో బతికేస్తున్నారని, నీతి వంతమైన పాలన అద్భుతంగా సాగుతోందని టముకు వేస్తూ, బాబు కళ్లకు గంతలు కట్టింది ఆయన అనుకూల మీడియా. ఆ విధంగా బాబుకు కీడు చేసిందనే అనుకోవాలి.

పార్టీ పత్రికలైన విశాలాంధ్ర, ప్రజాశక్తి ఎలాగైనా రాయవచ్చు. పార్టీ పత్రిక కాకపోయినా, పార్టీకోసమే పుట్టి, పార్టీ అధినేత ఓనర్ అయిన సాక్షి ఎలా రాసుకున్నా ఓకె. నమ్మడం నమ్మకపోవడం జనాల వంతు. కానీ ఇండివిడ్యువల్ మీడియా కూడా బాబు భజనలో తరిస్తే ఎలా?

సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం…
బాబు అనుకూల పత్రిక ఒకటి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయనను అపర భగీరధుడి లెవెల్ లో మోస్తూ వచ్చింది. నిజానికి పట్టిసీమ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు చూపుతో సిద్దంచేసిన పోలవరం కాలవలు పనికి వచ్చాయన్నది మాత్రం ప్రొజెక్ట్ చేయలేదు. వైఎస్ బతికి వుండగా ఈ కాలవల నిర్మాణాన్ని ఇదే మీడియా భయంకరంగా వ్యతిరేకించిన సంగతి గుర్తు చేయలేదు.

సరే, ఆ సంగతి అలావుంచితే, ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి, ఫలితాలు వచ్చాయి, తెలుగుదేశం ఓఢింది. పోలవరం ప్రాంతంలో కూడా ఘోరంగా ఓడింది. ఇప్పుడు అదే మీడియా ఏమని రాసింది? పోలవరం ప్రాంతంలో జనాలు అందరూ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకున్నారు. వారికి సరైన సహాయం అందించలేదు. నిర్వాసితుల ప్యాకేజీ బాగాలేదు. అసలు అమలు కాలేదు. అంటూ ఇలా రకరకాలుగా?

ఇదే కథనం ముందుగా రాసి వుండే బాబు, అక్కడి జనాల అసంతృప్తి గమనించి జాగ్రత్తపడి వుండేవారు కదా? బాబు తన అనుకూల మీడియా వండి వారుస్తున్న కథనాలు గుడ్డిగా నమ్మారు. వారు చూపించిన యాంగిల్ ను చూసే ప్రయత్నం చేయలేదు. ఈ మీడియా సంస్థలు ఎంత గొప్పది అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచే జనాల సమస్యలపై కథనాలు వండి వార్చడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఎప్పుడూ బాబు భజన చేసుకుంటూ వెళ్తే సర్క్యులేషన్ కిందకు జారిపోతుంది.

అందుకే ఈ మీడియా సంస్థలు ఎన్నికల వరకు ప్రజల సమస్యలు దాచేసి, ఆ తరువాత అవన్నీ బయటకు తీయడం అన్నది దాదాపు దశాబ్దాల కాలంగా అలవాటు చేసుకున్నాయి. ఇదే స్కీమును ఈ అయిదేళ్లు పాటించాయి. అదే సమయంలో ఒక కొత్త స్ట్రాటజీ కూడా అలవాటు చేసుకున్నాయి. ప్రజలు పడేపాట్లు, సమస్యలు, ఇలాంటివి ఒక జిల్లావి మరో జిల్లాకు తెలియకుండా, మరీ ప్రచారం కాకుండా స్థానిక ఎడిషన్లకు పరిమితం చేసాయి. మెయిన్ ఎడిషన్ మొత్తాన్ని బాబు భజనకు తాకట్టు పెట్టాయి.

ఇదే మీడియా చేసిన మరో తప్పిదం ఏమిటంటే, మోడీతో బాబు అంటకాగినంత కాలం మోడీని మోసాయి. ఎప్పుడయితే బాబు తెగతెంపులు చేసుకున్నాయో, మోడీని భయంకరంగా తిట్టడం ప్రారంభించాయి. అంతకు ముందు మోడీ నిర్ణయాలన్నీ శహభాష్ అన్నాయి. ఇప్పుడు మోడీ చేసిన వన్నీ తప్పుడు పనులు అన్నాయి. ఇవన్నీ జనాలు గమనించారు. మీడియా ఎలా మాట మారుస్తోందో? నిజాలు దాస్తోందో? బాబు పంచన ఊడిగం చేస్తోందో అర్థం అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా అందివచ్చింది.

నెట్ యూసేజ్ పెరిగింది. పల్లెపల్లెల్లోకి వాట్సాప్, యూట్యూబ్, వెళ్లిపోయింది. వీటినిండా బాబు వ్యతిరేక ప్రచారం వెల్లువెత్తింది. దాంతో జనాలకు బాబు అనుకూల మీడియా ప్రచారం పట్టలేదు. ఇదంతా ఇలావుంటే వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేసి ఓ పక్కన కూర్చోపెట్టడం అన్నది బాబు అనుకూల మీడియాకు నచ్చలేదు. దాంతో దీని మీద సన్నాయి నొక్కులు నొక్కుతూ కథనాలు వండడం ప్రారంభించారు. ఇవన్నీ భాజపా జనాలు తమ అధిష్టానానికి నివేదించారు. దాంతో బాబుకు భాజపాకు మధ్య గ్యాప్ మెల్లగా పెరగడం ప్రారంభమైంది. బాబు అనుకూల మీడియా ఇలా మెల్లగా ప్రారంభించి, బాబు-మోడీ బంధం విడిపోయేంత వరకు నిద్రపోలేదు.

ఇప్పుడు తెలుగుదేశం జనాలే ఓ మీడియా సంస్థ అధినేతను ఆఫ్ ది రికార్డుగా తప్పు పడుతున్నారు. మోడీ దూరం అయ్యేవరకు అతగాడు నిద్రపోలేదని, మోడీతో వుండి వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి వుండేది కాదని అంటున్నారు. బాబు ఓటమికి అతగాడు, అతగాడి మీడియా పరోక్షంగా కీడు చేసాయని వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద నికార్సయిన, నిజయతీపరుడైన, నిర్మొహమాటి అయిన మిత్రుడు వుంటే మంచిది కానీ, భజనపరుడు, భట్రాజు లాంటి వాడు కాదని మరోసారి బాబు అనుకూల మీడియా నిరూపించినట్లు అయింది.

-ఆర్వీ

సినిమా రివ్యూ: సీత