విజయవాడ ఎంపీ కేశినేని నాని కాస్త ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. భాజపాలోకి వెళ్తారని వినిపిస్తున్న కేశినేని నానిని ఆ దిశగా మరింత ముందుకు తోసేలావుంది ఈ దావా వ్యవహారం. ఎందుకంటే దావా వేసింది మొండితనానికి మారుపేరు అయిన పివిపి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పివిపి, నాని ఇద్దరూ పోటీచేసారు. పివిపి సంగతి అంతగా తెలియని నాని, ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా పివిపి మీద ఓపెన్ గా రకరకాల ఆరోపణలు, విమర్శలు చేసారు. అప్పట్లోనే పివిపి వీటి మీద స్పందించి, తన మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తే లీగల్ గా ఫేస్ చేయాల్సి వుంటుందని చెప్పారు.
ఇప్పుడు కార్యాచరణలోకి దిగారు. ఈ మేరకు కేశినేని నానికి లీగల్ నోటీసు పంపారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తనపై కేశినేని నాని చేసిన ఆరోపణల విడియోలను యూట్యూబ్ నుంచి తొలగించేలా చేయాలని, భవిష్యత్ లో మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని మాట ఇవ్వాలని ఆ లీగల్ నోటీస్ లో కోరారు. లేదూ అంటే ఈ విషయంలో ముందుకు సాగుతానని స్పష్టంచేసారు.
పివిపితో వ్యవహారం మామూలు తాటాకు చప్పుళ్ల మాదిరిగా వుండదు. ఆయన లీగల్ గా మాత్రం చాలా గట్టిగా ప్రొసీడ్ అవుతారు. అందువల్ల కేశినేని నాని ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడానికి కుదరదు. ఏదో విధంగా పివిపిపై వత్తిడి తెచ్చి, విత్ డ్రా చేయించుకోవాలి. అలా చేయాలంటే చాలా మందిలా భాజపా ఆశ్రయంలోకి చేరడం ఒక్కటేమార్గం ఏమో?