మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?

విశాఖ జిల్లా వైసీపీలో కీలక నేతలు అంతా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా మంది అయిపూ అజా అయితే తెలియడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగి సందడి చేసిన వారు అంతా…

విశాఖ జిల్లా వైసీపీలో కీలక నేతలు అంతా స్తబ్దుగా ఉంటున్నారు. చాలా మంది అయిపూ అజా అయితే తెలియడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగి సందడి చేసిన వారు అంతా ఇపుడు తెర చాటుకు వెళ్ళారు.

వీరిలో ఎంత మంది పార్టీలో ఉంటున్నారు ఏమిటి అన్నది బహుశా అధినాయకత్వానికి అయినా తెలుసా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. విశాఖ ఎంపీగా 2019 నుండి 2024 వరకూ అయిదేళ్ళ పాటు పనిచేసిన వైసీపీ ముఖ్య నేత ఎంవీవీ సత్యనారాయణ పార్టీ ఓటమి తరువాత అయితే ఎక్కడా కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు. ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. వాటిలోనే తలమునకలు అవుతున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగినా పార్టీ పేరు అయితే ఎక్కడా కనిపించలేదని గుర్తు చేస్తున్నారు.

ఇంతకీ ఈ మాజీ ఎంపీ పార్టీలో కొనసాగుతారా లేక వేరే ఆలోచనలు చేస్తునారా అన్న డౌట్లు వస్తున్నాయట. ఆయన కోరుకున్న విశాఖ తూర్పు అసెంబ్లీ సీటుని కూడా అధినాయకత్వం ఇచ్చింది. దాని వల్ల తూర్పు నుంచి మొదలైన ముసలం వైసీపీని విశాఖలో ఏమీ కాకుండా చేసింది. అంతే కాదు ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని దూరం చేసి ఎన్నికల్లో తీవ్ర నష్టం చేసింది.

ఆయన కోసం ఇంత భారీ మూల్యం పార్టీ చెల్లించినా పార్టీకి ఆయన మాత్రం అండగా లేకపోవడమే రాజకీయ విషాదం అని అంటున్నారు. విశాఖ తూర్పులో బీసీలు ఎక్కువ. ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. వారికి టికెట్ ఇచ్చి ఉంటే వైసీపీకి విశాఖలో సామాజికపరంగా దన్ను అయినా దొరికేది అని అప్పట్లోనే అనుకున్నారు.

అధినాయకత్వం చేసిన తప్పుల ఫలితంగానే కొన్ని నియోజకవర్గాలలో ఈ రోజుకీ ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ మాజీ ఎంపీ పార్టీలో కొనసాగుతారా లేదా అంటే ఆయన టచ్ మీ నాట్ అనే అంటున్నారని చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కొంత మంది నేతలను టార్గెట్ చేసింది. మాజీ ఎంపీ విషయంలోనూ విశాఖకు చెందిన కూటమి నేతలు పట్టుదలగా ఉన్నారు.

దాంతో వైసీపీతో అంటకాగితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించే వ్యూహాత్మకంగా ఆయన పార్టీకి దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నది ఏంటి అంటే ఆయనకు ఆయనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వైసీపీ హై కమాండ్ కి చెప్పారు అని అంటున్నారు. వీటిలో ఏది నిజమో ఏది గాసిప్ అన్నది తెలియదు కానీ మాజీ ఎంపీ వైసీపీలో అయితే కనిపించడం లేదు అన్నది పక్కా నిజం అని అంతా అంటున్నారు.

6 Replies to “మాజీ ఎంపీ తప్పుకున్నట్లేనా ?”

Comments are closed.