తెలుగుదేశం అనుకూల సర్వేశ్వరుడు లగడపాటి రాజగోపాల్ ఆ పార్టీ అనుకూల మీడియాకు నిన్నటికి నిన్న ఆపద్భాంధవుడిగా మారారు.
ఆయన సర్వే కనుక లేకుంటే, నిన్న సాయంత్రం చాలా చానెళ్లకు చాలా దిగాలుగా వుండేది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆ సర్వేనే హైలైట్ చేస్తూ కూర్చున్నారు. తెల్లవారి ఆ పార్టీ అనుకూల పత్రికలు కూడా ఆ సర్వేనే ప్రధానంగా అచ్చేసి వదిలాయి.
సరే ఆ సంగతి అలా వుంచితే ఈ సర్వే ముచ్చట ఓసారి చూద్దాం.
38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 వేల మంది ఓటర్ల అభిప్రాయమే లగడపాటి ఫ్లాష్ టీమ్ సర్వే ఫలితం.
అంటే కాస్త అటు ఇటుగా 25శాతం అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేసారన్నమాట. పైగా యాభై వేల మంది ఓటర్లు? అంటే ఇది ఎన్నో వంతు? దగ్గర దగ్గర నాలుగు కోట్లకు కాస్త తక్కువగా ఓటర్లు వుంటే యాభై మందితో శాంపిల్. 38 నియోజకవర్లాల్లో అంటే నియోజకవర్గానికి 1500 వందల మంది.
అంటే ఎంత చిన్న శాంపిల్ సర్వే అనుకోవాలి దీన్ని? అంటే రాజగోపాల్ చీకట్లో బాణం వేసారు.తగిలితే తన గొప్ప. లేదంటే లేదు. ఇంకా చిత్రమేమిటంటే, జెడి లక్ష్మీనారాయణ గెలుస్తారా? అంటే చెప్పలేదు. మంగళగిరి ఫలితం ఏమిటీ అంటే చెప్పలేదు.
మరి ఆ ముఫై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ రెండూ వున్నట్లా? లేనట్లా? అసలు ఆ ముఫై ఎనిమిది పోటా పోటీగా వున్నవా? తెలుగుదేశం అనుకూలమా? వైకాపా అనుకూలమా? ఓ నియోజకవర్గంలో 1500 మంచి మాటలే ప్రామాణికమా?
అదృష్టవశాత్తూ ఇది ఎగ్జిట్ పోల్ సర్వే కాబట్టి సరిపోయింది. ఇదే ప్రీ పోల్ సర్వే అయితే జనాలను మోసం చేయడం, పక్కదారి పట్టించడం కాదా? 23న ఈ సర్వే నిజమైతే తన ఘనతే అంటారు. లేదూ కాకపోతే, తన టీమ్ సరిగ్గా చేయలేదని తప్పించుకోవచ్చు.
తెలంగాణ విషయం ఇప్పటికీ ఆయన క్లారిటీ ఇవ్వలేదుగా. దీనికీ అంతే. నిజం కాకపోతే, అయిదేళ్ల తరువాత సంగతి. అదే లగడపాటి స్ట్రాటజీ కావచ్చు.