తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ ను తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు జాయింటుగా ఆ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశాయట. ఈ మేరకు బీజేపీ తెలంగాణ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిలు చెరో లేఖ రాశారట.
ఇంతకూ అర్జెంటుగా ఎందుకు కేసీఆర్ ను సీఎం పీఠం నుంచి దించేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారంటే.. తెలంగాణ సీఎం పీఠాన్ని కేసీఆర్ చెప్పుతో పోల్చారట. అది సీఎం పీఠాన్ని అవమానించడమేనట. అందుకే సీఎంగా కేసీఆర్ ను ఉండనీయకుండా చూడాలట. ఇదీ ఈ ఫిర్యాదు సారాంశం.
అయినా కేసీఆర్ ఆ మాటను మీడియా ముఖంగా అనలేదు. తన పార్టీ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టుగా పత్రికల్లో వచ్చిందట. అది కాంగ్రెస్, బీజేపీ నేతలు చదివారట. దానికి గానూ ఈ కంప్లైంట అట!
పత్రికల్లో, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా, ప్రచురితం అయ్యే వార్తలను పట్టుకుని సీఎంను డిస్ క్వాలిఫై చేసే వ్యవహారం ఎక్కడైనా ఉంటుందా? టీఆర్ఎస్ పార్టీ మీటింగులో కేసీఆర్ ఈ వ్యాఖ్య చేశాడని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి వీరు ఆ మీటింగుకు హాజరై విన్నట్టా?
నిజంగానే ఈ వ్యాఖ్యల గురించి కేసీఆర్ ను గవర్నర్ వివరణ కోరతారా? ప్రతిపక్ష పార్టీలు ఆధారాలు లేకుండా లేఖలు రాస్తే.. సీఎంను గవర్నర్ వివరణ కోరే సంప్రదాయాలుంటాయా?
ఇక కాలి చెప్పు లేదా, ఎడమ కాలి చెప్పు… అనే ఉపమానాన్ని కేసీఆర్ అధికారికంగా వాడరనే అనుకుందాం. అది అంత తప్పు అయిపోతుందా? తనకు అధికారం అనే ఆపేక్ష లేదు అని చెప్పుకునేందుకు కేసీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చు. తనకు తెలంగాణ రాష్ట్రం సాధించిన కీర్తి చాలని, సీఎం పీఠం అక్కర్లేదని ఇప్పుడు కేసీఆర్ అనడం కూడా కామెడీనే! ఇన్నేళ్ల తర్వాత అది తెలిసిందా అని సామాన్యులు అనుకోవచ్చు!
కేసీఆర్ ను ఏం విమర్శించాలో తెలియక కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద రాజ్యాంగబద్ధమైన పాయింట్ ను పట్టినట్టుగా ఒక ఉపమానాన్ని పట్టుకుని ఇంత లేఖలు రాసినట్టున్నారు. అది కూడా పత్రికల్లో ప్రచురితమైన వార్తలే ఆధారాలట.
అయినా.. కేసీఆర్ అయినా, కాంగ్రెస్-బీజేపీ నేతలు అయినా.. చెప్పులు అనగానే వాటిని అంత తక్కువ చేసి చూడనక్కర్లేదు. చెప్పులు లేకుండా ఎవరికీ రోజు గడవదు. మనిషిని ఎంతగానో కాపాడేది చెప్పులే. పనులు చేసుకునే వాళ్లకూ, కర్షకులకూ చెప్పులు ప్రాణాలకు రక్షణ ఇచ్చేంత కవచాలు అయితే, పెద్దోళ్లకు చెప్పులు స్టేటస్ సింబల్.
బాగా డబ్బున్న వాళ్లు చేసే తొలి పని వీలైనన్ని చెప్పుల జతలను కలిగి ఉండటం అనేది సైకాలజిస్టులు కూడా చెప్పే విషయం. ఇంటి బయటే వదిలినా.. చెప్పులు మనిషికి అంత గొప్పవి. వాటిని కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మరీ అంత తక్కువ చేసి చూడనక్కర్లేదు. థింక్ బిగ్.