చంద్రబాబును కార్నర్ చేసిన వెంకయ్య!

‘అయిదేళ్లలో ఇదే కోరాను. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు’ ఇది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్య. హైదరాబాదులో నిరుపయోగంగా ఉన్న ఏపీ సెక్రటేరియేట్ వాటా భవనాలను తెలంగాణకు అప్పగించేస్తూ గవర్నర్ నిర్ణయం…

‘అయిదేళ్లలో ఇదే కోరాను. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు’ ఇది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్య. హైదరాబాదులో నిరుపయోగంగా ఉన్న ఏపీ సెక్రటేరియేట్ వాటా భవనాలను తెలంగాణకు అప్పగించేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత… వెంకయ్యనాయుడు ట్విటర్ ద్వారా ఈ రకంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రవిభజనలో కీలకంగా ఉండి, విభజన సమయంలో పదేళ్లపాటు ప్రత్యేకహోదా కోసం పోరాడి, తర్వాత మౌనం వహించి, ప్యాకేజీ తానే తీసుకువచ్చానని ప్రకటించి.. బహుపాత్రలు పోషించిన వెంకయ్యనాయుడు ఇరురాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కార్నర్ చేస్తున్నట్లుగానే ఉన్నాయి.

అయిదేళ్లుగా ఇదే చెబుతున్నాను… కార్యరూపం దాల్చలేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కొత్తగా వచ్చినమార్పు- చంద్రబాబునాయుడు మాజీ కావడం మాత్రమే. అంటే… చంద్రబాబునాయుడు ఉండగా సమస్యలు పరిష్కారం కాలేదు. ఆయన దిగిపోగానే పరిష్కారానికి నోచుకుంటున్నాయి అనేది వెంకయ్యనాయుడు అభిప్రాయంగా పరిగణించాల్సి వస్తోంది. తీసుకునే ప్రతి నిర్ణయమూ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉండాలని కోరుకునే చంద్రబాబు హైదరాబాదులో రాజధానిని పదేళ్లపాటు కొనసాగించే వెసులుబాటు ఉన్నప్పటికీ… ఉన్నపళంగా తరలించుకుని వెళ్లిపోయి.. భవనాలను మాత్రం నిరుపయోగంగా వదిలేశారు.

నిజానికి రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన అనేక వివాదాలు ఇంకా పెండింగ్ లోనే ఉండవచ్చు గాక… కానీ, భవనాలను నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరువయ్యేలా వదిలేయడం అందుకు పరిష్కారం కాదు. భవనాలు జాతి ఆస్తి. వాటిని వృథా చేసే హక్కు, కస్టోడియన్ లుగా మాత్రమే వ్యవహరించాల్సిన ప్రభుత్వాలకు లేదు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం అటు భవనాలను ఇవ్వలేదు, ఇటు వాడుకోవడమూ లేదు.

అలాగని… అన్ని పంపకాలూ తేలేదాకా పట్టిఉంచాలనే పట్టుదలతో చంద్రబాబు వ్యవహరించారని అనుకోవడానికి కూడా వీల్లేదు. శాసనసభలోని జూబ్లీహాలును కూడా అమరావతికి తరలిపోయిన చాలాకాలం తర్వాతే ఇటీవలే తెలంగాణకు అప్పగించారు. కేసీఆర్ తనకు, తన ప్రతిపాదనలకు లొంగడం లేదు గనుక… తాను పొత్తుపెట్టుకోవాలనుకుంటే అంగీకరించలేదు గనుక… తెలంగాణతో సున్నం పెట్టుకునే ధోరణిలో చంద్రబాబు వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది.

ఇప్పుడు వెంకయ్యనాయుడు మాటలను గమనిస్తోంటే… ఇప్పుడు జరుగుతున్న సుహృద్భావ పంపకాలను ఆయన అయిదేళ్లుగా చెబుతున్నా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదనే అభిప్రాయం కూడా కలుగుతోంది.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు