కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఫిరాయింపు నేతలతో ప్రభుత్వం నిలుపుకుంది. యడియూరప్ప ను పక్కన పెట్టి, బొమ్మైని సీఎంగా చేశారు. కాషాయవాదుల్లో కూడా ఎంతో కొంత లిబరల్ గా కనిపించారు యడియూరప్ప. అయితే ఆయనపై సొంత పార్టీ నేతలే అవినీతి ముద్ర వేసి పక్కన పెట్టించారు. బొమ్మైని సీఎంగా చేసింది అధిష్టానం.
ఇక బొమ్మై నాయకత్వంలో బీజేపీ వివిధ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తింటూ ఉంది. సానుభూతి కోటాలోని ఒక ఎంపీ సీటు ఉప ఎన్నికలో బీజేపీ ఐదు వేల మెజారిటీతో నెగ్గింది. ఇక స్థానిక ఎన్నికల్లో కూడా కమలానికి ఎదురుదెబ్బలే పడ్డాయి. లోకల్ జనాలను కదిలిస్తే.. కర్ణాటకలో మరోసారి కాంగ్రెస్ లేస్తుందనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో వరసగా బొమ్మై ప్రభుత్వం మతం వ్యవహారాలనే కదిలిస్తూ ఉంది. ఇప్పటికే మత మార్పిడిలకు సంబంధించి బొమ్మై ప్రభుత్వం తెచ్చిన బిల్లు కాక రేపుతూ ఉంది. మత మార్పిడిల నిరోధానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. ఇందులో పెట్టిన విషయాలు ఇంకా ఏ మేరకు కోర్టుల ముందు నిలబడతాయో చూడాల్సి ఉంది. అయితే ఆ బిల్లుతో హిందుత్వవాదులను మెప్పించే ప్రయత్నం జరుగుతోంది.
ఇక స్కూళ్లలోకి హిజాబ్ నిషేధం మరో రచ్చ రేపుతూ ఉంది. ముస్లిం అమ్మాయిలు, యువతులు విద్యాలయాల్లోకి హిజాబ్ లతో ప్రవేశించడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంపై ముస్లిం వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతూ ఉంది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ లు కూడా బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ అంశంపై ముస్లిం యువతులు కోర్టును ఆశ్రయించారు.
సిక్కు పిల్లలకు స్కూళ్లకు తలపాగాలు పెట్టుకుని వెళ్లే అవకాశం ఉన్నప్పుడు, ముస్లిం యువతులు హిజాబ్ ధరించి ఎందుకు వెళ్లకూడదు? అనే లాజిక్ కూడా వినిపిస్తూ ఉంది. ఇంకోవైపు ఒక చోట స్కూల్ పిల్లలు కాషాయ కండువాలు వేసుకుని కనిపించడం, జై శ్రీరామ్ నినాదాలు మార్మోగడం గమనార్హం. ఇదంతా చూస్తే.. విద్యార్థులను కూడా స్పష్టంగా విభజించే యత్నాలూ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. స్కూళ్లలోకి కూడా మతరాజకీయం చొరబడుతున్నట్టుగా ఉంది కర్ణాటకలో.