గత ఎన్నికల టైమ్ లో టాలీవుడ్ ను బాగా దువ్వారు మోదీ. ప్రచారానికి హైదరాబాద్ రావడంతో పాటు.. టాలీవుడ్ ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని అయ్యాక టాలీవుడ్ ను మరిచారు. రెండోసారి కూడా అదే తీరు.. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ నోట టాలీవుడ్ మాట వినిపించింది. ఈసారి కూడా కారణం ఎన్నికలే అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ఫీవర్ మొదలైంది, ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. దీంతో టాలీవుడ్ ను మరోసారి పేంపర్ చేసే పని పెట్టుకున్నారు మోదీ.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని, ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలుగు సినిమా వాళ్లను ఓ రేంజ్ లో పొగడ్తల్లో ముంచెత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిందని అన్నారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తోందని చెప్పారు. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందని చెప్పారు.
సినిమావాళ్లపై ప్రేమ..
ఎవర్ని ఎక్కడ, ఎలా తమవైపు తిప్పుకోవాలో ప్రధాని నరేంద్రమోదీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ సినిమావాళ్లకుండే క్రేజ్ ని వాడుకుంటే వారి అభిమానులంతా పార్టీకి లాయల్ గా ఉంటారు. అందులోనూ తెలుగు సినిమా నటులకు ఉండే ఫాలోయింగ్ వేరు.
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ తో తెలుగు సినిమా టాలెంట్ ప్రపంచవ్యాప్తమవుతోంది. విదేశీ క్రికెటర్లు, ఇతర దేశాల ఆర్టిస్ట్ లు సైతం తెలుగు పాటలకు చిందులేస్తున్నారు. ఈ దశలో తెలుగు సినిమాని, తెలుగు ఆర్టిస్ట్ లను పొగిడితే పోయేదేముంది. అందుకే తెలుగు సినిమా వాళ్లకు బ్రహ్మాండమైన గేలం వేశారు మోదీ.
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. ఈ దశలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ లాంటి కార్యక్రమాలు మోదీ పొలిటికల్ మైలేజీకి బాగా ఉపయోగపడతాయి. అందుకే ఆయన హైదరాబాద్ కి ఉత్సాహంగా వచ్చారు. తన పని తాను చూసుకుని పోతూ.. సినిమావాళ్లపై కూడా ప్రశంసల జల్లు కురిపించి తనవైపు తిప్పుకున్నారు.
రేపు సార్వత్రిక ఎన్నికలనాటికి నలుగురైదుగురు ప్రముఖులతో తనకి అనుకూలంగా ట్వీట్లు వేయించగలిగినా అదే చాలు అనుకుంటున్నారు మోదీ. బాహుబలి మెచ్చిన మోదీ, పుష్ప మెచ్చిన ప్రధాని, జక్కన్న మనసు గెలుచుకున్న చాయ్ వాలా అనే టైటిల్స్ ఎంత బాగుంటాయో కదా. మోదీకి కావాల్సింది కూడా అదే. అందుకే ఆయన తాపత్రయమంతా. ఇకపై సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ఆయన టాలీవుడ్ కు గాలం వేస్తూనే ఉంటారు. రాబోయే రెండేళ్లలో అది జనమంతా చూస్తారు. ఇది ఫిక్స్.