కరోనా మూడో వేవ్ నాటి పరిస్థితులను మొదటి, రెండో వేవ్ ల నాటి పరిస్థితులతో ఏ మాత్రం పోలిక లేదు! రోజుకు ఏకంగా మూడున్నర లక్షల స్థాయిలో అధికారికంగానే కేసులు వచ్చాయి మూడో వేవ్ లో. ఇవి గాక అనధికారికంగా మరెన్నో కేసులు కూడా వచ్చాయి.
మూడో వేవ్ లో నడిచిన కొన్ని ఆఫీసుల నుంచి సమాచారం సేకరిస్తే.. ఒక్కో ఆఫీసులో కనీసం ముప్పై, నలభై శాతం మందికి కరోనా సోకింది! రోజువారీగా ఆఫీసుకు వెళ్లే వారిలో ఇలా ఇంతమంది కరోనా బారిన పడ్డారు. వీరి వల్ల వీరి ఇళ్లలోని వాళ్లకూ ఎంతో కొంత శాతం కరోనా సోకి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే.. మూడో వేవ్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం, ఎక్కడా ఏదీ ఆగలేదు! కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను కొన్ని రోజులు మూసి వేయించడం మినహాయిస్తే.. ఈ సారి వేవ్ ను దృష్టిలో ఉంచుకుని పెట్టిన ఆంక్షలు పెద్దగా లేవు. నైట్ కర్ఫ్యూ అంటున్నారు కానీ, దాని వల్ల వచ్చేదీ పోయేదీ లేదు.
అర్ధరాత్రి పార్టీలు చేసుకునే వారికే కొంత ఇబ్బంది దాని వల్ల. అలాగే సినిమా థియేటర్ల సెకెండ్ షోలు రద్దయ్యాయి. మూడో వేవ్ లో దేశమంతా యాభై శాతం కెపాసిటీతో మాత్రమే థియేటర్లు నడిచాయి. ఈ నియమం మాత్రం ఇంకా దేశమంతా అమల్లో ఉన్నట్టుంది. దీని వల్ల జనజీవనానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
పెద్దగా ఆంక్షలు లేవు, జనాలు ఎక్కడా తగ్గలేదు. పండగలు, సంబరాలు జరిగాయి. షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతూనే ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకునే వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగతా వాళ్లు లేదు. ఆసుపత్రులైతే కిటకిటలాడాయి. కానీ.. రెండో వేవ్ లాంటి భయంకరమైన పరిస్థితి లేదు. నూటికి 99 శాతం మంది చాలా తేలికగా కోలుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
సెకెండ్ వేవ్ ముగిసిన తర్వాత రోజుకు పది వేల కేసులు వచ్చాయి. అప్పటికే జనాలు కరోనాను లైట్ తీసుకున్నారు. ఇప్పుడు రోజుకు లక్ష కేసులు వస్తున్నా అంతే లైట్ గా తీసుకుంటున్నారు. వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టకపోయినా కరోనా అంటే భయం అయితే చాలా వరకూ తగ్గిపోయింది.
తనదాకా వస్తే కాస్త గాబరా పడుతున్నారేమో కానీ, వస్తుందేమో .. అనే భయం మాత్రం చాలా వరకూ తగ్గిన వైనం కనిపిస్తోంది. విపరీతమైన ఆంక్షలు, లాక్ డౌన్లు, కర్ఫ్యూలు, షాపులు మూత.. కంపెనీల మూత, పరిశ్రమల మూత.. వంటి పరిణామాలు ఏమీ చోటు చేసుకుండానే మూడో వేవ్ ను ఇండియా జయించి ముందుకు సాగుతూ ఉంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో అత్యంత సానుకూల పరిణామం ఇది.