తెలుగునేల మీద మేథో దారిద్ర్యం తాండవిస్తున్నదంటే.. మేధావులు కాని చాలా మందికి ముందుగా కోపం వస్తుంది. కొండొకచో మేథావులు అయిన వారికి కూడా కోపం వస్తుంది. ఈ రెండు రకాల వారికీ వినమ్రంగా మనవి చేసుకుంటున్నది ఏంటంటే.. ఈ ‘మేథో దారిద్ర్యం’ అనే వ్యాఖ్య- ‘మేధావులే లేరు’ అని సూత్రీకరిస్తున్నది కాదు.. మేధావుల అచేతనత్వాన్ని ప్రస్తావిస్తున్నది.
చైతన్యరహితమైన వారి సుషుప్తావస్థను గురించి వేదన చెందుతున్నది. ప్రధానంగా పాత్రికేయ ప్రపంచంలో ప్రమాణాలను మరచిపోయి, ఉద్యోగానికి పరిమితమైన, ఇరుకు చట్రాలలో ఇరుక్కుపోయిన మేథస్సు గురించి మధన పడుతున్నది. సంకుచిత ప్రయోజనాలతో నడిచే మీడియా యాజమాన్యాలు చేతులు కట్టేసిన తర్వాత.. జర్నలిస్టులు ఏ రోటి కాడ ఆ పాట పాడే కూలిపడతులుగానే మిగిలిపోతున్నారు.
ముందుగా ఒక కథ చెప్పుకోవాలి..
వెనకటికి ఓ చిన్న పల్లెలో ఓ కోడిపుంజు ఉండేదిట. దానికి వేపకాయంత వెర్రి కూడా ఉంది. ఎంచక్కా ప్రతి రోజూ పొద్దున్నే ఊరందరికంటె ముందే మేలుకుని.. బాగా గొంతెత్తి.. బిగ్గరగా.. ‘కొక్కొ..రో.. కో..’ అని కూసేది. దాని కూతతో ఊరంతా నిద్దర్లేచేది. కొన్నాళ్లకు ఆ కోడిపుంజుకు ఒక లెవెల్లో అహంకారం వచ్చింది. ‘నేను లేకపోతే ఈ పల్లెకు దిక్కులేదు. నేను కూత కూయకపోతే.. నిద్దర్లేవడం కూడా చేత కాదు.. కానీ నన్ను వీళ్లు గౌరవంగా చూసుకోవడం లేదు..’ అనుకుంది. ‘ఈ పల్లెకు బుద్ధి చెప్పాలని కూడా అనుకుంది’ అనుకున్నదే తడవుగా.. మరునాడు ఉదయం తెల్లారగట్ల ‘కొక్కొ..రో..కో..’ అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.
కోడి కూత వినపడలేదు గానీ.. మామూలుగానే తెల్లారింది. ప్రజలందరూ కూడా నిద్రలేచారు. ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. కోడిపుంజు పంతానికి పోయి.. మర్రోజు కూడా కూత పెట్టలేదు. జనం మామూలుగానే నిద్ర లేచారు గానీ.. కోడి పుంజు కూత పెట్టడం లేదనే సంగతి గుర్తించారు. ‘ఏదోలే’ అని ఒకటిరెండు రోజులు సర్దుకున్నారు. కానీ కోడిపుంజు అసలు కూత పెట్టడమే లేదని తేలిన తర్వాత.. దీనికి ఏమైందో ఏమో, కూతపెట్టడం కూడా మరచిపోయిన కోడి మరింకెందుకు పనికొస్తుంది- అనుకుని.. కోసుకుని కూర వండుకుని తినేశారు.
ఈ కథ చెప్పే నీతి ఏమిటి? ప్రపంచం మొత్తం నా మీదనే నడుస్తోంది.. అనే భావన ఎవ్వరికైనా ఉంటే అది తప్పు. వారు ఎంతటి కీలకమైన విధులు, బాధ్యతలు అయినా నిర్వర్తిస్తుండవచ్చు గాక.. వారి పరోక్షంలు ప్రపంచం స్తంభించిపోవడం జరగదు. కానీ మేధావుల ప్రపంచంగా భావించే మీడియా రంగంలో మాత్రం ఈ సిద్ధాంతం గురించిన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు.
‘ఏది సత్యం ఏదసత్యం.. ఓ మహాత్మా ఓ మహర్షీ..’ అంటూ శ్రీశ్రీ ఎన్నడో తెగ వాపోయాడు. తెలుగు పత్రికలు చదువుతున్న వారికి మాత్రం ఈ ప్రశ్న ప్రతిరోజూ ఎదురవుతూ ఉంటుంది.
పార్టీల గూటిచిలకలు
ప్రజల్లో ఆదరణ ఉన్న పత్రికలు పార్టీలకు గూటిచిలకలుగా మారిపోయాయి. ఏ గూటిచిలక ఆ పాటే పాడుతూ ఉంటుంది. ఒక సంఘటన జరిగితే.. దానిని తాము తొడుక్కున పార్టీ రంగు కళ్లజోడులోంచి చూడడం.. అదే పార్టీ రంగులనే వార్తకు అద్ది.. పత్రికల్లో అచ్చొత్తించడం. ప్రజలందరూ కూడా పార్టీ కళ్లజోడులోంచే ఆ వార్తను అర్థం చేసుకోవాలని ఆశించడం ఇది రివాజు అయిపోయింది.
తాము ఏం చెబితే ప్రపంచం మొత్తం అదే నిజమని నమ్ముతుందనేది వారి భ్రమ. తాము చెప్పకపోతే.. ప్రపంచం.. ఆ వార్తను అసలు కోణంలోంచి అర్థం చేసుకోవడం జరగదు అని వారి అత్యాశ! ఇలాంటి భ్రమల్లో వారు అనైతిక, అసహజ, అపభ్రంశ పోకడలతో మీడియాను నడుపుతూ ఉంటారు. పార్టీలక్ష్యాలే తమ తమ జర్నలిజం పరమావధిగా పెచ్చరిల్లుతూ ఉన్నారు. తెలుగు పత్రికలు అచ్చంగా పార్టీలకు కరపత్రాలు అన్న అపకీర్తిని జగద్విదితం చేసేస్తున్నారు.
ఏ సంఘటన జరిగినా.. దానికి ఏమాత్రం రాజకీయ వాసన ఉన్నప్పటికీ భిన్న పత్రికల్లో భిన్న రీతుల్లో రిపోర్టు అవుతుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే.. సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి, ప్రభుత్వ కార్యకలాపాలకు డెమ్మీ సైజులో ఉండే బ్రోషర్ లాగా ఉంటుంది. రాజకీయ లంకెతో ఏ వ్యవహారం జరిగినా.. ఎవ్వరు ఏం మాట్లాడినా సరే.. ఆ మాటల్లో జగన్‌ను కీర్తించడానికి లేదా, చంద్రబాబు పవన్ కల్యాణ్ లను తిట్టిపోయడానికి తగిన అంశాలు ఏవి దొరుకుతాయో మాత్రమే గమనిస్తుంటుంది.
ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండూ తెలుగుదేశానికి బాకా పత్రికలు. ఈ పాత్రను కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్న పత్రికలు. నిజానికి సాక్షి పత్రిక పుట్టడానికి మూలకారణాలు ఈ పత్రికలే. అప్పట్లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఏ పనిచేసినా.. పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న ఈ రెండు పత్రికలతో ఆయన ఎంతో విసిగిపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో.. వీరిద్దరి ప్రచారాన్ని తిప్పికొట్టడమే మౌలిక లక్ష్యంగా సాక్షి ఆవిర్భవించింది. ఇప్పుడది.. జగన్మోహన్ రెడ్డి అనుకూల ప్రచారానికి అత్యుత్తమ వేదికగా, వ్యతిరేక విషయాలు ఏవి ఉన్నా.. వాటిని అణగదొక్కి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు అందించే పత్రికగా తయారైంది.
తెలుగుదేశానికి భజన అనేకంటె.. జగన్ వ్యతిరేక ఎజెండాను భుజాన మోయడం ఈనాడు, ఆంధ్రజ్యోతిల లక్ష్యం. ఈ ఇద్దరిలో ఈనాడుది కాస్త శ్రోత్రియమైన పతనం అయితే.. ఆంధ్రజ్యోతిది బజారుస్థాయి లేకి దిగజారుడుతనం! చీమ చిటుక్కుమంటే చాలు.. బ్రహ్మాండం బద్ధలైపోయినట్టుగా చిలవలు పలవలు అల్లి ప్రచారంలో పెట్టడానికి, ప్రజలు నవ్వుకుంటారనే వెరపు కూడా లేకుండా ఆంధ్రజ్యోతి సిద్ధమైపోతుంది.
ఆ మాటకొస్తే అబద్ధపు ప్రచారాలను పత్రిక రూపంలో శాస్త్రోక్తంగా ప్రజలమీదికి వెదజల్లడంలో ఈ మూడు పత్రికలూ ఒకదానికొకటి తీసిపోవు. చిన్న ఉదాహరణ తీసుకుంటే.. విజయవాడలో లక్షమందికి పైగా ఉద్యోగులు హాజరై విజయవాడ వీధులను జనప్రవాహంగా ముంచెత్తేసి ప్రభుత్వాన్ని నానా బీభత్సంగా నిందిస్తే.. సాక్షి దినపత్రిక ఆ సక్సెస్ యావత్తూ తెలుగుదేశం, జనసేనలు మద్దతివ్వడం వల్లనే, వాళ్ల కార్యకర్తలు కూడా హాజరు కావడం వల్ల మాత్రమే విజయవంతం అయిందని అవాకులు చెవాకులు రాస్తుంది.
అదే సమయంలో.. కేంద్రంలో సహాయమంత్రి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతే అనే విషయాన్ని సభలో రొటీన్ ప్రశ్నకు సమాధానంగా చెబితే.. ఆ ప్రకటనతో ఇక అమరావతి ఫైనల్ అయిపోయినట్టుగా.. రైతులు తమ దీక్షలు కూడా విరమించి ఇంటికి పోవచ్చు అన్నంతగా బ్యానర్ వార్త ప్రయారిటీతో ఈనాడు ప్రచురిస్తుంది. ఈ దిగజారుడు మెట్ల మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ పాతాళ సోపానాల మీద ఉన్నదో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవడం కూడా అనవసరం. నమస్తే తెలంగాణ తీరు మరీ చోద్యం. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కించిత్ మాట కూడా ఆ పత్రికలో కనిపించదు. పూర్తిగా కవరేజీ విస్మరించే ఘట్టాలు కూడా అనేకం తారసిల్లుతాయి.
వారికి ప్రమాణాలు లేవా.. తెలియవా?
ఆయా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు విషయం లేదా, వృత్తి ప్రమాణాలు లేవా, మరీ అంత చవకబారు సరుకు ఉన్నారా? అనే సందేహం ఎవరికైనా కలిగితే అది తప్పు. చవకబారు సరుకు కొంత మేర ఉన్న మాట వాస్తవమే గానీ.. అగ్రదినపత్రికల్లో అన్నిచోట్లా ఉద్ధండులైన జర్నలిస్టులే నిర్ణాయక పాత్రల్లో ఉన్నారు. ఇదేమీ వారితో వ్యక్తిగత పరిచయంతో చెప్పదగిన అంశం కాదు.. ఆయా పత్రికలను గమనిస్తేనే తెలుస్తుంది.
ఒకవైపు పత్రికలు గూటిచిలకలుగా మారిపోయాయని అంటూనే.. మరోవైపు ఉద్ధండులు ఉన్నారని కితాబివ్వడం విరుద్ధంగా లేదా అనే అనుమానం ఎవ్వరికైనా కలగవచ్చు. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, ఆ మాటకొస్తే రాజకీయాలకు సంబంధించిన వార్తలను మినహాయిస్తే.. తతిమ్మా వార్తల విషయంలో పత్రికల ప్రాధాన్యాలు, ఆయా వార్తలను వారు ప్రెజంట్ చేసే తీరు అన్నీ కూడా అద్భుతంగానే ఉంటాయి.
మనం ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల సంగతులే చూసుకుందాం! బిజినెస్, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్, ఎడ్యుకేషన్, సినిమా, ఫీచర్స్, మేగజైన్ తదితర సెక్షన్లన్నీ అద్భుతమైన వార్తలతో, అత్యంత కచ్చితమైన ప్రాధాన్యాలతో వస్తుంటాయి. ఎటొచ్చీ.. రాజకీయాల విషయం వచ్చేసరికే వస్తుంది తంటా అంతా.
రాజకీయ వార్తల విషయంలో జర్నలిస్టులు తామెరిగిన ప్రమాణాలు మొత్తం మరచిపోతారు. తమకు ఏ ప్రమాణాలు అయితే ‘డిక్టేట్ చేయబడ్డాయో’ అవి మాత్రమే గుర్తుకు వస్తాయి. మనసా వాచా కర్మేణా పూర్తిగా ఆ సిద్ధాంతాలనే తమ నమ్మకంలోకి తీసుకుంటారు. అందుకే అంతే చిత్తశుద్ధితో ఆ అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు.
ప్రజలు తెలివి మీరిపోయారు..
ఇలాంటి దిగజారుడు మీడియా పోకడల ద్వారా ఈ పత్రికలు ప్రజలను నమ్మించగలుగుతున్నాయా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. పత్రికలు అంటేనే ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పటిష్టవేదికలుగా ఒకప్పుడు పేరుండేది. ఎన్ టి రామారావును గద్దె ఎక్కించడానికి.. ఈనాడు దినపత్రిక అడ్డగోలుగా వన్ సైడెడ్ వార్తలను అందించిన తొలినాళ్లలో కూడా ప్రజల్లో పత్రికల పట్ల విశ్వాసం ఉండేది. కానీ ఇపుడు పోయింది.
జగన్ ను మేమే గద్దె ఎక్కించాం అని గానీ.. జగన్‌ను మేమే ఓడించగలం అని గానీ ఏ పత్రికా అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే అది వారి ఆత్మవంచన. ఎందుకంటే.. ప్రజలు పత్రికలను నమ్మడం మానేశారు. కేవలం సమాచారం కోసం మాత్రమే వాటిని చదువుతున్నారు. పైగా.. వారు అందించే వార్తలు ఆయా పత్రికలకు ముడిట్టిన రాజకీయ రంగుల కళ్లజోడులోంచి మాత్రమే చదువుకుని.. ఆ కోణంలోంచే అర్థం చేసుకుంటున్నారు.
జగన్ తప్పు చేశాడని ఆంధ్రజ్యోతి రాసిందంటే.. ఆ పత్రిక చదివేవాళ్లంతా ఆ కథనం నమ్మేస్తారని అనుకుంటే పొరబాటే. కథనం మొత్తం చదివిన తర్వాత.. ఆంధ్రజ్యోతి వాడు జగన్ తప్పు చేశాడని రాశాడంటే అది అబద్ధమే అయి ఉంటుందిలే అని ప్రజలు సింపుల్ గా అనేసుకుంటున్నారు. సాక్షి విషయంలోనూ అంతే!
చంద్రబాబు రాష్ట్రానికి చేసిన ద్రోహాల గురించి పుంఖాను పుంఖాలుగా ప్రచురించినా.. రాసిన వారు ఇంత తిట్టేశాం అని ఆనందించాల్సిందే తప్ప.. సామాన్య పాఠకుడు వాటి జోలికి వెళ్లడం లేదు. చంద్రబాబును ఎన్ని రకాలుగా తిట్టవచ్చో కొత్త పాయింట్లు దొరుకుతాయని మహా అయితే వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కడూ అక్షరం అక్షరమూ అందులో చదువుతుండవచ్చు. అన్ని పత్రికలూ కలిసి ఇలా విశ్వసనీయతను చంపేయడం.. పత్రికల జగత్తుకు పెద్ద శాపం.
కోడిపుంజు నుంచి నీతి నేర్వండి ప్లీజ్
ముందు మనం కోడిపుంజు కథ చెప్పుకున్నాం. నేను కూయకపోతే పల్లెకు తెల్లారదు అని కోడిపుంజు భ్రమపడినట్లే.. నేను చెప్పకపోతే ప్రజలకు నిజాలు తెలియవు అని పత్రికలు భ్రమపడుతుంటాయి. ప్రజలు నిజాల్ని చాలా చక్కగా తెలుసుకుంటుంటారు. ఇవాళ్టి ఆధునికతరం పోకడల్లో.. మీడియాను ఒకరు తమ చేతిలో ఉంచుకోవడం.. పాఠకుల్ని మబ్బులో పెట్టడం అనేది జరగని పని! ఇలాంటి సందర్భంలోనే కోడిపుంజ కథనుంచి మన పత్రికలు నీతి నేర్చుకోవాలి.
కూత పెట్టడం మానేసిన తర్వాత పల్లెప్రజలు ఏం చేశారు? కోడిపుంజును కోసి కూర వండుకుని తినేశారు. పత్రికలో విషయంలోనైనా అదే జరుగుతుంది. తమ విశ్వసనీయతను తామే పాతర వేసేసుకుంటూ.. పత్రికలు పూర్తిగా దిగజారిపోతే గనుక.. ప్రజలు వాటిని కొనడమే మానేస్తారు. ఇప్పటికే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి లను తెలుగుదేశం వారు, సాక్షిని వైసీపీ వారు, నమస్తే తెలంగాణను టీఆర్ఎస్ వారు మాత్రమే కొనే పరిస్థితి దాపురించింది. ఒక ఇంట్లో టీపాయ్ మీద ఏ పత్రిక కనిపిస్తుందనే దాన్ని బట్టి.. ఆ ఇంటివారి రాజకీయ భావజాలాన్ని అంచనావేసే సిగ్గుమాలిన రోజులు దాపురించాయి. కనీసం ఈ పరిస్థితి అయినా కలకాలం ఉండదు.
తమ భావజాలం మాత్రమే అందుతూ ఉన్నా.. ఆ పత్రికలను చదవడానికి జనానికి వెగటు పుడుతుంది. అసహ్యించుకుంటారు. పత్రికలను కొనడం మానేస్తారు. ఎటూ ఏయే రంగాల వార్తలను పత్రికలు నిష్పాక్షికంగా నిజాయితీగా అందిస్తున్నాయో ఆ రకం సమాచారం ప్రజలకు అందడానికి ఇవాళ అనేకానేక ఇతర ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కారణాలు అన్నీ కలిసి.. దిగజారుడు పత్రికల పతనాన్ని నిర్దేశిస్తాయి.
.. విజయలక్ష్మి