అధికారంలో ఉన్న పార్టీయో, ముఖ్యమంత్రో, మంత్రో … ఇలా ఎవరైనా సరే ఒక హామీ ఇచ్చి అమలు చేయకపోతేనో లేదా అభిప్రాయం మార్చుకుంటేనో యూ టర్న్ తీసుకున్నాడని అంటారు. దీన్నే తెలుగులో మడమ తిప్పడం అంటారు. ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ ఎప్పుడూ మాట తప్పను మడమ తిప్పను అంటూ ఉంటారు. ఆయన ఎన్నికల్లోనూ, అధికారంలోకి వచ్చాకా ఎన్నో హామీలు ఇచ్చారు. కాదనం. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని హామీలు నెరవేర్చక పోవచ్చు.
ఒక్కోసారి వెనకా ముందు ఆలోచించుకోకుండా హామీలు ఇచ్చేసి ఆ తరువాత పరిస్థితి (కరోనా వంటి ఉపద్రవాలు రావడంవల్ల ) అనుకూలించక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోవచ్చు. బడ్జెట్లో పెట్టిన పథకాలన్నీ వచ్చే ఏడాది మార్చివరకు నిలిపేస్తున్నట్లు తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకు కారణం నిధులన్నీ కరోనా నివారణ చర్యలకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. మరి దీన్ని యూటర్న్ అనగలమా? అనుకోని ఉపద్రవం ఏర్పడింది కాబట్టి బడ్జెట్ పథకాలు అమలు చేయలేకపోయారని కొందరు అనుకుంటారు. ప్రభుత్వం మాట తప్పిందని కొందరు భావిస్తారు. సహజంగానే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి.
ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని అంటాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు కమ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మాజీ మంత్రి అయిన లోకేష్ సీఎం జగన్ ఫలానా హామీలు నెరవేర్చలేదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే దీనికి లోకేష్ యూటర్న్ అనకుండా జె టర్న్ అన్నాడు. జె అంటే జగన్ అన్నమాట జె టర్న్ అంటే జగన్ చెప్పిన పని చేయలేదని అర్ధం.
లోకేష్ ఓ జాబితా ఇచ్చాడు. ప్రత్యేకహోదా పైన జె టర్న్, 45 ఏళ్లకే పెన్షన్ పై జె టర్న్, సన్న బియ్యంపై జె టర్న్, రాజధానిపై జె టర్న్, రైతు భరోసాపై జె టర్న్, అమ్మ ఒడిపై జె టర్న్, మధ్య నిషేధంపై జె టర్న్, 3 వేల పెన్షన్ పై జె టర్న్ … ఇలా లిస్టు చదివాడు. ఈ మధ్య టీడీపీ నాయకులు సాక్షి మీడియాను కొత్త రకంగా విమర్శిస్తున్నారు.
వైకాపా నాయకులు టీడీపీ అనుకూల మీడియాను ఎల్లో మీడియా అని విమర్శిస్తుండగా, టీడీపీ నాయకులు సాక్షి మీడియాకు బ్లూ మీడియా అనే పదం ఖాయం చేశారు. బ్లూ ఫిలిం అనే పదం స్ఫూరించేలా బ్లూ మీడియా అంటున్నారు. బ్లూ ఫిలిం అంటే చూడకూడనిదనే అభిప్రాయం ఉంది కదా. బ్లూ మీడియా అంటే చదవకూడని, చూడకూడని పేపర్, టీవీ అని తమ్ముళ్ల ఉద్దేశం కావచ్చు. కొత్త పదాలు క్రియేట్ చేయడం, ఉన్న పదాలకు కొత్త అర్ధాలు తీయడం రాజకీయ నాయకుల ప్రత్యేకత.