ఉత్తరాంధ్రాలో సత్తా చాటినందుకే ఏపీలో వైసీపీకి 151 సీట్లు వచ్చిన సగంతి విధితమే. అదే సమయంలో టీడీపీకి ఎపుడూ వెన్ను దన్నుగా ఉండే ఈ మూడు జిల్లాలు హ్యాండ్ ఇవ్వడం వల్లనే కేవలం 23 సీట్లకు ఆ పార్టీ చతికిపడిన సంగతీ ఎరుకే.
ఈ నేపధ్యంలో ఏపీలో అతి ముఖ్యమైన రాజకీయ సమరాంగణ వేదికగా ఉత్తరాంధ్రా జిల్లాలను అంతా చెబుతున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు అయినా స్థానిక ఎన్నికలు అయినా కూడా ఉత్తరాంధ్రాలో 2019 నాటి మ్యాజిక్ ని కొనసాగించాలని వైసీపీ గట్టి పట్టుదల మీద ఉంది.
ఎపుడు ఎన్నికలు వచ్చినా మూడు జిల్లాలు మరో మారు టీడీపీ మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. అదే విధంగా విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ సర్కార్ ప్రకటించిన నేపధ్యంలో ఇక్కడ విజయం మీద ఆ పార్టీకి ధీమా కనిపిస్తూంటే టీడీపీ నేతలు మాత్రం కంచుకోటలు మా వైపే అంటున్నాయి.
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెట్టిన జగన్ అతి తొందరలోనే భారీ బహిరంగ సభను ఇక్కడ నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి ఏపీలో హైలెట్ అయ్యే రాజకీయ వేదిక ఇదేనని అంటున్నారు.