వైఎస్ జగన్మోహనరెడ్డి విషయంలో ప్రతీ దానికీ విపక్షాలు విమర్శలే చేస్తూ ఉంటాయి. మంచి చేసినా కూడా మెచ్చకపోగా ఏ చిన్న తప్పు కనిపించినా రాద్ధాంతం చేయడానికి మాత్రం తయారుగా ఉంటాయని అంటారు.
సరే విపక్షం కాబట్టి వారిది పక్కా రాజకీయ కోణమే కాబట్టి అలాగే మాట్లాడుతారు అనుకోవాలి. కానీ తటస్థులు చదువరులు, మేధావులు మాత్రం జగన్ మంచి చేస్తే ఎప్పటికపుడు ప్రశంసించకుండా ఉండలేదు.
ఇదిలా ఉంటే ఓ వైపు కరోనా కాలం. ఉన్న ఉపాధికే ఠికానా లేని కాలం. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకుని జగన్ అర్చకుల ఆకలి తీర్చారని అంతా మెచ్చుకుంటున్నారు.
అర్చకుల వేతనాలను ఒక్కసారిగా పెంచుతూ జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర మహా స్వామి హర్షం వ్యక్తం చేశారు.
జగన్ తీసుకున్న నిర్ణయం భేష్ అంటూ ఆయన దీవించారు. ఈ కష్టకాలంలో అర్చకుల పట్ల మానవత్వంతో జగన్ ఆలోచించారని అందుకు గానూ వారందరి తరఫున తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని స్వామీజీ పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర వేళ అర్చకుల జీతాలు పెంచుతాను అని హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకోవడం పట్ల అర్చక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.