పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. మమతా తమ్ముడిని కరోనా బలి తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లో కరోనాను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
కనీసం కరోనా సెకెండ్ వేవ్ ఉధృతిని పరిగణలోకి తీసుకుని చివరి మూడు విడతల్లోని ఎన్నికలనైనా ఒకేసారి నిర్వహించాలని మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్, ఇతర పక్షాలు చేసిన విజ్ఞప్తిని ఈసీ పరిగణలోకి తీసుకోలేదు.
ఏది ఏమైతేనేం పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాయి. వాటి దుష్ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శనివారం కోవిడ్‌తో మమతాబెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ ప్రాణాలు కోల్పోయారు. మమతా బెనర్జీ సోదరుడి మరణం కావడంతో దేశ వ్యాప్తంగా తెలిసొచ్చింది.
కరోనా బారిన పడిన అషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ … చివరికి కరోనాపై పోరాటంలో అలసిపోయారు. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 136 మంది పశ్చిమబెంగాల్‌లో మరణించారు.
కరోనాకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తారతమ్యాలు లేవు. తనకు అడ్డొచ్చిన వారిపై పంజా విసురుతోంది. డబ్బున్న వాళ్లైతే కనీసం ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా బారిన పడిన పేదల అవస్థల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.