ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రోజుకో ఆరోపణ చేస్తూ కాలం గడుపుతున్నారు చంద్రబాబు. కొత్తరకం స్ట్రెయిన్ పుట్టుకొచ్చిందంటూ ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేశారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
“ప్రభుత్వం వద్దని మొత్తుకున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని స్థానిక ఎన్నికలు జరిపించాడు బాబు. కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచిని వదిలి పెట్టదు. ఎన్నికలు లేకుంటే పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేది. ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉండేవి కాదు.”
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే కరోనా కేసుల వ్యాప్తి ఇంత ఎక్కువగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు విజయసాయి. మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేష్ పై కూడా విమర్శలు గుప్పించారు. వారసులంతా గెలుస్తుంటే, లోకేష్ మాత్రం ఎన్నికల్లో తుక్కైపోయారని విమర్శించారు.
“వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు.”
ఇలా తండ్రికొడుకుల్ని మరోసారి చెడుగుడు ఆడుకున్నారు విజయసాయి రెడ్డి. మరోవైపు జగన్ చేస్తున్న కరోనా కట్టడి చర్యలపై ప్రశంసలు కురిపించారు. తల్లిదండ్రులిద్దరీ పాజిటివ్ వచ్చినప్పుడు, పిల్లలకు వ్యాధి సోకకుండా 32 బాలల సంరక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేసి జగన్ ఆలోచనను విజయసాయి మెచ్చుకున్నారు.