ప్రశ్నించడానికి వచ్చానని చెప్పుకునే పవన్ కల్యాణ్, ఆ పని మానేసి చాన్నాళ్లవుతోంది. కనీసం స్పందించాల్సిన విషయాలపై కూడా పవన్ రాజకీయ లెక్కలేసుకుని నోరు కట్టేసుకుని కూర్చోవడం జనసైనికులకు కూడా నచ్చడం లేదు. కర్నూలులో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పవన్.. దేశం మొత్తాన్ని కదిపిన హత్రాస్ దుర్మార్గంపై మాత్రం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు.
పోనీ బీజేపీతో పొత్తు న్యాయం పాటిస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు ఎప్పట్లానే మౌనం వ్రతంలోనే ఉంటే పరువు దక్కేది. తగుదునమ్మా అంటూ ఇప్పుడు బైటకొచ్చి హథ్రాస్ ఘటనలో సీబీఐ దర్యాప్తు సరైన నిర్ణయం అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయడం మాత్రం పవన్ దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచింది.
తప్పు జరిగినప్పుడు కనీసం నిరసన తెలపకపోగా.. దానిపై ఎంక్వయిరీ వేస్తే అక్కడికేదో న్యాయం జరిగినట్టు ప్రెస్ నోట్ విడుదల చేయడం జనసేనకి మాత్రమే చెల్లింది. కనీసం ఏపీ బీజేపీ కూడా ఇక్కడ మాట్లాడలేని సందర్భంలో జనసేన తరపున ఇలాంటి ప్రకటన రావడం సిగ్గుచేటు కాక ఇంకేంటి.
“హథ్రాస్ లో జరిగిన పైశాచిక అత్యాచార కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించడం ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ భావిస్తోంది. సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన విశ్వసిస్తోంది.” ఇలా సాగింది ఆ ప్రెస్ నోట్. కనీసం ఆ దారుణం జరిగినప్పుడు నోరు మెదపని జనసేన నాయకులు, సీబీఐ ఎంక్వయిరీ వేస్తే మాత్రం చప్పట్లు కొట్టడం దారుణాతి దారుణం.
పైగా అదే ప్రెస్ నోట్ లో సుగాలి ప్రీతి వ్యవహారంలో పవన్ కల్యాణ్ కర్నూలులో కవాతు చేపట్టడం వల్ల ఆ కేసుని సీబీఐకి అప్పగించాలని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదని కూడా దెప్పి పొడిచింది. ఇక్కడ కూడా తన రాజకీయ స్వార్థం చూసుకున్న పవన్ కల్యాణ్ ని ఇక ఏమనాలి?
పక్క రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి పవన్ పోరాటం చేయాలని ఎవరూ డిమాండ్ చేయరు. దుర్ఘటనపై స్పందించలేనప్పుడు విచారణపై కూడా స్పందించకుండా ఉంటే కాస్తో కూస్తో గౌరవంగా ఉండేది. తప్పు జరిగినప్పుడు వేలెత్తి చూపకుండా.. సీబీఐ విచారణకు అప్పగించడం భేష్ అంటూ పొగడటం ఎంతవరకు సమంజసమో జనసేన పార్టీ ఆలోచించుకోవాలి.
కేవలం బీజేపీతో పెట్టుకున్న పొత్తుకే.. ఇంతలా ఆ పార్టీ నేతల్ని వెనకేసుకొస్తున్న పవన్, ఇక పూర్తిస్థాయిలో పార్టీని బీజేపీలో విలీనం చేస్తే.. మోడీకి భక్తాగ్రేసరుడు కావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.