అత్యాచారాలపై బీజేపీ ఎమ్మెల్యే దారుణ కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలు మహిళలను , అత్యాచార బాధితులను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయి. దీంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే రాజకీ యంగా బీజేపీని ఇరుకున పడేసేలా ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల యువతులపై అత్యాచారాలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నష్ట నివారణ చర్యలు ఎలా చేపట్టాలో అర్థం కాక తలపట్టుకుని కూచొంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే బల్లియా సురేంద్ర సింగ్ అత్యాచార బాధితులతో పాటు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.
అత్యాచారాలను ఆపడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు మంచి విలువలు నేర్పించాలని బీజేపీ ఎమ్మెల్యే సూచించాడు. అత్యాచార సంఘటనలను ఆపడానికి యువతుల తల్లిదండ్రులు వారిలో మంచి విలువలను పెంపొందించేలా చూడాలని ఆయన కోరాడు. ఇలాంటి అత్యాచార సంఘటనలను (సంస్కృతి, విలువలు)తో మాత్రమే ఆపవచ్చని, (పాలన) లేదా తల్వార్ (కత్తి)తో కాదని ఎమ్మెల్యే సింగ్ చెప్పుకొచ్చాడు.
ఆయన ప్రకటనపై రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దళిత యువతుల అత్యాచారాలకు వాళ్లే కారణమైనట్టు ఎమ్మెల్యే మాటలున్నాయని మండిపడుతున్నారు. తప్పులు పనులను అడ్డుకోవాల్సింది పోయి …మంచి విలువలు లేకపోవడం వల్లే రేప్‌లకు గురి అవుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, ఇది బీజేపీ దురంహకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు అత్యాచారాలకు పాల్పడ్డం బీజేపీ సంస్కృతా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్లలకు సంస్కృతి, విలువలు లేకపోవడం వల్లే అత్యాచారాలకు గురి అవుతున్నారని బీజేపీ ప్రజాప్రతినిధి చెప్పడం కంటే నీచత్వం మరొకటి లేదని నెటిజన్లు, రాజకీయ పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యే మాటలను ఆ రాష్ట్ర అధికార పార్టీ ఎలా సమర్థించుకుంటుందో మరి!