కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతగల విపక్షంగా రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఈ మధ్యనే సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దాంతో, అంతా ఆయన నిర్ణయాన్ని అభినందించారు. కానీ, జనసైనికులు మాత్రం, షరామామూలుగానే అధికార పార్టీపై రాజకీయ విమర్శలు కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన కొందరు నేతలదీ ఇదే పరిస్థితి.
ప్రధానంగా గ్రామ వాలంటీర్లను లక్ష్యంగా చేసుకుని, జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు పనిచేయడం అత్యంత సాహసోపేతమైన విషయం. ప్రభుత్వం, గ్రామ వాలంటీర్ వ్యవస్థని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోన్న దరిమిలా, విపక్షాలు, ప్రభుత్వానికి మంచి సూచనలు చేయాల్సింది పోయి.. గ్రామ వాలంటీర్ వ్యవస్థపైనా, ప్రభుత్వంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తుండడం దురదృష్టకరం.
కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడం.. అదే సమయంలో, జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలున్నవారిని గుర్తించడం.. విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం.. ఇలా బృహత్తరమైన బాద్యతను గ్రామ వాలంటీర్లు భుజానికెత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో వారు తమ విధినిర్వహణను ధైర్యంగా కొనసాగిస్తున్నందుకు ఎవరైనా అభినందించి తీరాల్సిందే. అభినందించడం సంగతి పక్కన పెట్టి, వాలంటీర్ వ్యవస్థపై అరోపణలు చేయడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
జనసేన పార్టీకి సంబంధించిన ‘శతఘ్ని’ సోషల్ మీడియా టీమ్ ఈ విషయంలో అత్యుత్సాహం చూపిస్తోందని చెప్పక తప్పదు. ముందు ముందు రాష్ట్రం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. రాజకీయ పార్టీలు రాజకీయాల్ని పక్కన పెట్టి, ప్రభుత్వానికి సహకరించకపోతే.. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. తెలుగుదేశం పార్టీ నుంచి ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘సంయమనం’ ఆశించలేం. కానీ, టీడీపీతో అంటకాగుతున్న జనసేన.. అనే ముద్ర చెరిపేసుకోవాలంటే.. జనసేన పార్టీ ఇప్పుడే మరింత విజ్ఞతతో వ్యవహరించడం అవసరం.