ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ప్రస్తుతం ఆమె చెన్నై అడయార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
రోజా భర్త, డైరెక్టర్ ఆర్కే సెల్వమణి తాజాగా ఓ ఆడియో విడుదల చేశారు. రోజా ఆరోగ్యంపై ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
ఇప్పటికే ఆమెకు ఈ ఆపరేషన్లు చేయాల్సి ఉందన్నారు. అయితే గతేడాది కరోనా, ఈ జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఆపరేషన్లు వాయిదా పడ్డాయని ఆయన వెల్లడించారు. రెండు ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయని, అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నిన్న రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిప్ట్ చేశారన్నారు. రెండు మూడురోజుల్లో యధావిధిగా ఆహారం తీసుకుంటారన్నారు. మరో రెండువారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితు లను దృష్టిలో పెట్టుకుని రోజాను చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఎవరినీ ఆస్పత్రి సిబ్బంది అనుమతించడం లేదని ఆయన వివరించారు.