వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. ఈ దఫా ఆయన ట్వీట్ బాణం బీజేపీ -జనసేన కూటమి వైపు సంధించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ అస్త్రాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అంతే శక్తిమంతమైన ట్వీట్ బాణాన్ని వదిలారు.
ఈ నేపథ్యంలో ఇద్దరి నేతల మధ్య ట్వీట్ ఫైట్ సోషల్ మీడియాలో ఆసక్తి కలిగించింది. మాటకు మాట, తూటాకు తూటా అన్నట్టు విజయసాయిరెడ్డి, సోము వీర్రాజు పరస్పరం ఘాటు విమర్శలతో తిరుపతి ఎన్నికలను హీటెక్కించారు. వాళ్లిద్దరి మధ్య సాగిన ట్వీట్ ఫైట్ గురించి తెలుసుకుందాం.
ఈ సమరానికి మొదట విజయసాయిరెడ్డి బీజం వేశారు. దీనికి తిరుపతి ఉప ఎన్నిక, బీజేపీ-జనసేన కూటమి మధ్య సాగిన పొత్తు ఎపిసోడ్ కారణమైంది. ‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు’ అని విజయసాయిరెడ్డి బీజేపీ-జనసేన కూటమిని దెప్పి పొడిచారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటైన ట్వీట్‌తో రిప్లై ఇచ్చారు. సోము ఏమంటారంటే…
‘మా ఊసు ఎందుకులే.. కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా.. లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి తామేం ఇచ్చామో చెప్పి.. క్యాబేజి పువ్వులు పంపిస్తామని, బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి’ అంటూ సెటైర్ సంధించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో సోషల్ మీడియాలో సాగుతున్న పొలిటికల్ ఫైట్‌పై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు.