టీడీపీలో నాయకత్వ మార్పుపై గత కొంత కాలంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంత వరకూ నాయకత్వ మార్పు గురించి టీడీపీ కార్యకర్తల డిమాండ్ ఏంటో తెలుసుకున్నాం.
తాజాగా టీడీపీ నాయకత్వ మార్పుపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని రాజమండ్రిలో సోమవారం బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుందన్నారు. ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా గ్రౌండ్ రియాల్టీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గోరంట్ల వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి.
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా, దివంగత ఎన్టీఆర్ వైపు నిలిచారు. అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన బుచ్చయ్య చౌదరి అంటే అధినేతకు మొదటి నుంచి ఆగ్రహమే అని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక సందర్భంలో చెప్పారు.
అందుకే బుచ్చయ్యకు తన కేబినెట్‌లో చోటు కల్పించలేదని కూడా ఓ ప్రముఖ చానల్‌లో ఆయనతో జరిగిన డిబేట్‌లో ఉండవల్లి కుండబద్దలు కొట్టిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు.
టీడీపీలో కొత్త నాయకత్వం అంటే … ఇప్పుడున్న నాయకత్వంతో పార్టీ కోలుకోలేదని బుచ్చయ్య చౌదరి చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో ముక్కుసూటిగా మాట్లాడేనేతగా బుచ్చయ్య చౌదరికి గుర్తింపు ఉంది.
జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ బలోపేతానికి పనిచేయాలని కోరడం అంటే …ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని పార్టీ బాధ్యతలు స్వీకరించాలని బుచ్చయ్య చౌదరి పరోక్షంగా కోరుతున్నట్టేనని టీడీపీలో అంతర్గతంగా చర్చకు తెరలేపింది. ఏది ఏమైతేనేం, టీడీపీలో బుచ్చయ్య వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.