ఢిల్లీ తొక్కిసలాట.. తప్పు పాసింజర్లది కూడా

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఘటనలో పాసింజర్లది కూడా తప్పుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

సాధారణంగా తొక్కిసలాట ఘటనలు నిర్వహణ లోపం వల్ల జరుగుతాయి. లేదా అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతాయి. కానీ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఘటనలో పాసింజర్లది కూడా తప్పుంది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

“నా డ్యూటీ ముగిసింది. ఇంటికెళ్దామంటే బయటకెళ్లడానికి దారి లేదు. అప్పటికే సిబ్బంది ఎన్నో ఎనౌన్స్ మెంట్లు చేశారు. ప్రజలెవ్వరూ ఆ ప్రకటనల్ని పట్టించుకోలేదు. ఒకే చోట గుమిగూడొద్దని నేను కూడా చెబుతూ వస్తున్నాను. ఎవ్వరూ వినలేదు. నా కళ్లముందే తొక్కిసలాట జరిగింది.”

భారత వైమానిక దళానికి చెందిన ఓ సార్జెంట్ చెప్పిన మాటలివి. ఇదే విషయాన్ని మరో ప్రయాణికుడు కూడా ధృవీకరించాడు.

“జనం లెక్కకు మించి వచ్చారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిండిపోయింది. పండగ రోజుల్లో కూడా ఇంత రద్దీ నేనెప్పుడూ చూడలేదు. బ్రిడ్జిని, దానికి అనుబంధంగా ఉన్న మెట్ల మార్గాన్ని ఖాళీ చేయమంటూ వచ్చిన ప్రకటనల్ని నేనూ విన్నాను, కానీ ఎవ్వరూ ఆ ప్రకటనలు పట్టించుకోలేదు.”

ఫ్లాట్ ఫామ్స్ నిండిపోయిన విషయం కళ్లకు కనిపిస్తున్నప్పటికీ, బయట నుంచి మరింతమంది ప్రయాణికులు లోపలకు వచ్చేందుకు ప్రయత్నించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. తను మాత్రం పరిస్థితి చూసి తన కుటుంబంతో తిరిగి ఇంటికెళ్లిపోయానని అతడు చెప్పాడు.

కుంభమేళాను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్ లో సిబ్బంది మొత్తాన్ని మొహరించారు. ఉద్యోగులకు శెలవులు కూడా రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రెడీగా ఉంది. వీళ్లతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏం లాభం, ప్రయాణికులు చెప్పిన మాట వినాలి కదా.

“ప్రమాదం జరగొచ్చని మాకు ముందే అనిపించింది. రద్దీ చూసి మాకు అనుమానం వచ్చింది. కానీ మేం ఎంత చెప్పినా ప్రయాణికులు వినలేదు. రైల్వే ట్రాకులు దాటుకొని మరీ ఒక ఫ్లాట్ ఫామ్ నుంచి మరో ఫ్లాట్ ఫామ్ కు వందల మంది మారుతున్నారు. నా కళ్ల ముందే పరిస్థితి అదుపుతప్పింది” స్వయంగా ఓ రైల్వే పోలీస్ చెప్పిన మాటిది.

2 రైళ్లు ఆలస్యమవ్వడం ప్రమాదానికి ప్రధాన కారణమైతే, ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం మరో కారణం అనేది ప్రత్యక్ష సాక్షుల కథనం.

6 Replies to “ఢిల్లీ తొక్కిసలాట.. తప్పు పాసింజర్లది కూడా”

Comments are closed.